ఆదాయంలో ఎదురులేని వెదురు
● జిల్లాలోని మన్యంలో 5,381 ఎకరాల్లో వెదురు వనరు
● ప్రతి ఏటా అక్టోబర్ నుంచి జూన్ వరకూ వెదురు కర్రల కటింగ్
● ఒక్కసారి నరికినా మూడేళ్లలో మళ్లీ పెరుగుదల
బుట్టాయగూడెం: వెదురును పచ్చ బంగారం అంటారు. వెదురు బొంగులను కోష్టాలు, పందిళ్ల నిర్మాణానికి, ఇంటి పైకప్పులకు వాడతారు. నిచ్చెనల తయారీకీ ఉపయోగిస్తారు. వెదురును బద్దలుగా చీల్చి పలు రకాల వస్తువులను తయారు చేస్తారు. బుట్టలు, తట్టలు, గంపలు, చేటలు మొదలైనవి వెదురుతోనే చేస్తారు. వెదురు కలప పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని అడవిలో వేల ఎకరాల్లో సహజ సిద్ధంగా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వెదురు కూపులు పచ్చదనంతో ఎత్తయిన చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ వెదురు కర్రలను ప్రతి ఏటా అక్టోబర్ నెల నుంచి జూన్ నెలాఖరు వరకూ నరికించి జంగారెడ్డిగూడెంలో ఉన్న అటవీశాఖ వెదురు డిపోకు తరలించి అక్కడ వెదురు కర్రలను వేలం వేస్తారు.
మన్యంలో 5,381 ఎకరాల్లో వెదురు వనాలు
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్న అటవీ పరిధిలో సుమారు 5,318 ఎకరాల్లో వెదురు వనాలు ఉన్నాయి. బుట్టాయగూడెం మండలంలోని రేగులపాడు, ముంజులూరు, మోతుగూడెం, పోలవరం మండలంలోని కొల్లుమామిడి–1, 2 గుమ్ములూరు, తదితర ప్రాంతాల్లో వెదురు కొమ్ములను అటవీశాఖ అధికారులు పెంచుతున్నారు. వీటిలో ఒక్కో కూపును మూడు కూపులుగా విభజించారు. వెదురు బాగా పెరిగిన తర్వాత వాటిని అధికారులు నరికిస్తారు. అయితే వీఎస్‌ఎస్ కూపులుగా కూడా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలంలోని ఒర్రింక, ముంజులూరు, రేగులపాడు, చింతపల్లి, రేపల్లె అటవీ ప్రాంతంలో కూడా వెదురు వనాలు ఉన్నాయి. ఒక్కసారి నరికిన ప్రదేశంలో తిరిగి మళ్లీ మూడేళ్లకు వెదురు తయారవుతుంది. దానిని కూడా అటవీశాఖ అధికారులు కూలీలతో నరికిస్తారు. ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో వెదురు నరికే కార్యక్రమాన్ని అధికారులు చేపడతారు. ఇక్కడ నరికిన వెదురు కర్రలను లారీల్లో ఆరు నెలల పాటు జంగారెడ్డిగూడెం అటవీశాఖ డిపోకు తరలిస్తారు. ప్రస్తుతం వెదురు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నరికిన వెదురు కర్రలను లారీల్లో గిరిజనులు జంగారెడ్డిగూడెం డిపోకు తరలిస్తున్నారు.
200 కొండరెడ్డి కుటుంబాలకు జీవనోపాధి
పశ్చిమ ఏజెన్సీప్రాంతంలోని మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు ఉండవు. పూడు వ్యవసాయమే వారికి ఆదాయం. అది కూడా కేవలం తిండి గింజలు సమకూర్చుకోవడానికే తప్ప ఆదాయం కోసం కాదు. బుట్టాయగూడెం కుక్కునూరు, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు మండలాల పరిధిలో సుమారు 200 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు వెదురు కలప నరికివేత జీవనోపాధి కల్పిస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఈ వెదురు కలపను కొండరెడ్డి గిరిజనులకు ఆరు నెలలపాటు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
ఆదాయంలో ఎదురులేని వెదురు


