తణుకు ప్రభుత్వ కళాశాలకు ఐఎస్‌వో ధ్రువీకరణ
తణుకు అర్బన్: తణుకు చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాల పలు విభాగాల్లో ఐఎస్‌వో ప్రమాణాల్లో ధ్రువీకరణ సాధించిందని ప్రిన్సిపాల్ సీహెచ్ ఏడుకొండలు తెలిపారు. పర్యావరణ నిర్వహణ, విద్యా సేవల నాణ్యత, ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్రమాణాల్లో ధ్రువీకరణ పొందినట్లు చెప్పారు. ఈ ధ్రువీకరణలు హైదరాబాద్‌కు చెందిన హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ద్వారా జారీ చేయబడినట్లు స్పష్టం చేశారు. ఇది కళాశాల నాణ్యతా ప్రమాణాలకు అంతర్జాతీయ గుర్తింపు అని అన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమష్టి కృష్టితో ఈ ఘనత సాధ్యమైనట్లుగా వివరించారు.
నరసాపురం: రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాల గ్రౌండ్‌లో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన క్రికెట్ బాలుర టాలెంట్ స్పాటింగ్‌లో నరసాపురం పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. పట్ణణంలోని రుస్తుంబాద బాలాజీ క్రికెట్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న మామిడి వెంకట నవసూర్య, యర్రంశెట్టి దేవకీనందన్ ఎంపికయ్యారు. త్వరలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు.
మండవల్లి: గోడౌన్‌లో సిగరెట్ బాక్సుల చోరీ జరిగిన ఘటన లోకుమూడిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లోకుమూడిలో రత్న ఎంంటర్‌ప్రైజస్ పేరిట నిత్యావసర సరుకుల గోడౌన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 6న ఉదయం యజమాని గోడౌన్ వద్దకు వెళ్లగా షట్టర్ వంచబడి లాకులు తెరిచి ఉన్నాయి. లోపలకి వెళ్లి చూడగా 11 గోల్డ్‌ఫ్లాక్ సిగరెట్ బాక్సులు చోరీ జరిగినట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలియజేశారు. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీమవరం: భీమవరరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీంగ్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ నుంచి మూడు రోజులపాటు అంతర్ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల మెన్ అండ్ ఉమెన్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బీహెచ్‌వీఎస్ రామకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి మంగళవారం చెప్పారు. కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటలకు పోటీలను కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభిస్తారన్నారు. వాలీబాల్, కబడ్డీ, పికిల్ బాల్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు.
తణుకు అర్బన్: ప్రపంచ తెలుగు సభల్లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపునకు గోల్డ్ మెడల్ దక్కింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 5 తేదీల్లో గుంటూరులో శ్రీ సత్య సాయి స్పిరిచ్యువల్ సిటీ నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందకు పైగా చిత్రకారులు పాల్గొని కళాఖండాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో తాను ఎఫెక్షన్ శీర్షికతో రూపొందించిన చిత్రానికి గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నట్లు వెంకటాపు వివరించారు. చిత్రకళా ప్రదర్శన కోఆర్డినేటర్ కళారత్న ఎస్.విజయ్‌కుమార్, అమీర్ ఆర్ట్ అకాడమీ కార్యదర్శి డాక్టర్ అమీర్ జాన్, డ్రీమ్ ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ పెరపోగు రమేష్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ చిత్రకారులు కొండూరి నాగేశ్వరరావు, మారేడు రాము, మధు కురువ చేతులమీదుగా గోల్డ్‌మెడల్ అందుకున్నట్లు చెప్పారు.
తణుకు ప్రభుత్వ కళాశాలకు ఐఎస్‌వో ధ్రువీకరణ
తణుకు ప్రభుత్వ కళాశాలకు ఐఎస్‌వో ధ్రువీకరణ


