యువకుడిపై హత్యాయత్నం
ఆకివీడు: ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన ఆకివీడు మండలంలోని కోళ్లపర్రు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి తల్లిదండ్రులు సరోజనీ, బుల్లియ్య తెలిపిన వివరాల ప్రకారం కోళ్లపర్రు గ్రామ శివారు సగర్లపేటకు చెందిన గండికోట శివ సోమవారం రాత్రి ఆకివీడు వెళ్లి గ్రామానికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కాపుకాసి దాడి చేశారు. దీంతో అతడి తలకు, ఛాతిపైన, కుడి చేతి భుజం ఎముకకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న శివను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీహెచ్‌సీలో చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. బాధితుడి వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఆసుపత్రి నుంచి తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


