జంగారెడ్డిగూడెం: తన భర్తను తీవ్రంగా కొట్టి గాయపర్చిన కన్నాపురం రేంజ్ సబ్ డీఎఫ్‌ఓపై చర్యలు తీసుకోవాలని మడకం అనిత కోరింది. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనిత మాట్లాడుతూ ఈ నెల 10న తన భర్తను మాట్లాడాలని చెబుతూ అటవీశాఖాధికారులు ఫోన్ చేశారని, కన్నాపురం కార్యాలయానికి వెళ్లిన తన భర్తను తీవ్రంగా కొట్టి గాయపర్చారన్నారు. విషయం తెలుసుకున్న తాము అటవీశాఖ కార్యాలయానికి వెళ్లగా, వైద్యం తామే చేయిస్తామని, విషయం పెద్దది చేయవద్దని, చేస్తే కేసులు పెడతామని బెదిరించారని అనిత తెలిపింది. సబ్ డీఎఫ్‌వో, అతనికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, కులంతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని అనిత కోరింది. కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ మొడియం శ్రీనివాసరావు, జువ్వల బాబ్జి తదితరులు పాల్గొన్నారు.