
పడకేసిన మెడికల్ కాలేజీ నిర్మాణం
పది నెలలైనా పత్తా లేరు
నాడు ప్రతిపక్షంలో ఉన్న రామానాయుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి ఓ పక్క పనులు జరుగుతుండగా మరోపక్క కళాశాల పార్కింగ్ స్థలంలో నిలబడి ఇక్కడ ఏ పనులూ జరగడం లేదంటూ చాలా హడావుడి చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అక్కడ అంతా బురదే తప్ప పనులేమీ జరగడం లేదని తమ అనుకూల శ్రీపచ్చశ్రీ మీడియా ద్వారా రాద్ధాంతం సృష్టించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తోంది. అధికారంలో లేనప్పుడు మెడికల్ కళాశాల చుట్టూ తిరిగి రాద్ధాంతం చేసిన రామానాయుడు నేడు మంత్రి హోదాలో ఉండి మెడికల్ కళాశాల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. మెడికల్ కళాశాల వద్దకు వెళితే కాంట్రాక్టర్‌ను ప్రశ్నించలేని దుస్థితి. బిల్లులు విడుదల చేస్తే తాము పనులు మొదలు పెడతామని కాంట్రాక్టర్ ఎదురు ప్రశ్నిస్తారేమోననే భయంతో మంత్రి నిమ్మల మెడికల్ కళాశాల వైపు వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మెడికల్ కళాశాల పనులు త్వరగా పూర్తయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో పనులు ఆపించారని, కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఆపై నిధులు రిలీజ్ చేసి తమ హయాంలోనే మెడికల్ కళాశాల పూర్తయిందని గొప్పలు చెప్పుకోవడానికే ఇదంతా చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పడకేశాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్న సమయంలో.. నాడు ప్రతిపక్షంలో ఉన్న రామానాయుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి పనులు ఏమీ జరగడం లేదని నానా యాగీ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా అప్పుడు అల్లరి చేసిన టీడీపీ పెద్దలు వివిధ పదవుల్లో ఉండి కూడా ఇప్పటివరకు కశాళాల వైపే కన్నెత్తిచూసిన పాపాన పోలేదు. కనీసం బిల్లులు కూడా మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం కళాశాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
సుమారు రూ.75 కోట్లు వృథాయేనా..?
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, పరిసర ప్రాంత ప్రజలు మెడిసిన్ విద్య అభ్యసించే నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుమారు 60 ఎకరాల్లో రూ.475 కోట్ల వ్యయంతో ఇక్కడ మెడికల్ కళాశాల మంజూరు చేశారు. వర్చువల్ పద్ధతిలో ఆయన శంకుస్థాపన కూడా చేశారు. 2023 ఫిబ్రవరిలో ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్న మెగా కన్‌స్ట్రక్షన్ ఆగస్టులో పనులు ప్రారంభించింది. మొత్తం నిర్మాణం చేయాల్సిన బ్లాక్‌లు 16 కాగా మొదలుపెట్టిన బ్లాక్‌లు 3. వాటిలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ బ్లాక్‌లు ఫైల్స్ వర్క్‌లు (పిల్లర్ పనులు) పూర్తవ్వగా, 24 గంటల సర్వీస్ బ్లాక్‌లో 82 శాతం ఫైల్స్ వర్క్ పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.75 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. వీటి నిమిత్తం ఇంకా సుమారు రూ.30 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ పనులు నిలుపుదల చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ సైట్‌లో ఉన్న ఇసుక, ఇనుము, కంకర వంటి మెటీరియల్‌ను మెగా కంపెనీకి సంబంధించి మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల నిమిత్తం తరలించేశారు. మొత్తం సైటు ఖాళీ చేసేశారు.
నాడు ఓ పక్క పనులు జరుగుతున్నా ఏమీ జరగడం లేదంటూ నిరసనలు
నేడు పది నెలలైనా ఆ వైపే చూడని మంత్రి నిమ్మల
మెడికల్ కళాశాల బిల్లులు రాక పనులు నిలుపుదల చేసిన సంస్థ
ఇప్పటి వరకూ జరిగిన రూ. 75 కోట్ల పనులు గంగపాలేనా...?
ఇదీ దగ్గులూరు మెడికల్ కళాశాల దుస్థితి

పడకేసిన మెడికల్ కాలేజీ నిర్మాణం

పడకేసిన మెడికల్ కాలేజీ నిర్మాణం

పడకేసిన మెడికల్ కాలేజీ నిర్మాణం