
పోలీసుల దిగ్బంధంలో తణుకు
తణుకు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనలో భాగంగా ఆంక్షలు, నిర్భంధాల మధ్య తణుకు పట్టణం వేడెక్కింది. శుక్రవారం పట్టణ ప్రాంతం పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. తణుకు రాష్ట్రపతి రోడ్డు, పెరవలి రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు, సొసైటీ రోడ్డుల్లో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. నిరంతరం పోలీసు సైరన్‌లతో పట్టణ ప్రాంతం మార్మోగిపోయింది. తాడేపల్లిగూడెం, భీమవరం మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించి పారిశుద్ధ్య నిర్వహణ చేయిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా..
గతంలో తణుకు ప్రాంతానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి హాజరైనప్పటికీ ప్రజలపై ఎలాంటి ఆంక్షలు, ఇబ్బందులు లేకుండానే పర్యటన నిర్వహించారు. నేడు ఇంత భద్రత, ఇన్ని రకాల ఆంక్షలు ఏంటనేది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రపతి రోడ్డులో అడుగడుగునా పోలీసు అఽధికారులు, కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తుండగా పర్యవేక్షణకు ఉన్నతాధికారులు వాహనాల్లో తిరుగుతున్నారు. శనివారం చంద్రబాబు పర్యటన కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని విద్యాశాఖాధికారుల నుంచి ఆదేశాలివ్వగా, దుకాణదారులకు సైతం తమ దుకాణాలు మూసివేయాలని, సమావేశాలు నిర్వహించే ప్రాంతాల్లోని ఇళ్లలో సైతం కొత్త వారిని ఎవరినీ రానివ్వద్దని పోలీసులు ఆంక్షలు విధించడం ఆశ్చర్యం కలిగిస్తుందని ప్రజలు చెబుతున్నారు. శుక్రవారం తణుకులో సీఎం పర్యటన వ్యవహారాలకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర ఎమ్మెల్యేలు పనులను పర్యవేక్షించారు.
సీఎం పర్యటనతో ఎన్నడూ లేని విధంగా భద్రత
పట్టణంలో అడుగడుగునా ఆంక్షలు