
హైవేపై ఘోర ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
తాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతిచెందాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఒక ఐటీ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్ విభాగం ఉద్యోగి భోగెల్లి వెంకట సత్య సురేన్ (37), ఆయన భార్య నవ్య (35), కుమార్తె వాసకి కృష్ణ (5), బంధువు శ్రీరమ్య శాంత్రో కారులో తూర్పు గోదావరి జిల్లా ఏడిద గ్రామంలో జరగనున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయల్దేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపైకి వచ్చేసరికి సురేన్ డ్రైవ్ చేస్తున్న కారు జాతీయ రహదారి మెయింట్‌నెన్స్ పనులు చేస్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సత్య సురేన్, నవ్యలు అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె వాసకి కృష్ణ (5), బంధువు శ్రీరమ్యను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాసకి కృష్ణ మృతి చెందగా, శ్రీరమ్యను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ ఏఎస్సై పీవీకే.దుర్గారావు వివరాలు సేకరించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి, రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్ర మత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
మండపేటలో విషాద ఛాయలు
ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. సత్య సురేన్ తండ్రి పాపారావు రిటైర్డ్ ఉద్యోగి. ఈ ఘటనలో పాపారావు చెల్లెలు కుమార్తె ఉప్పులూరి శ్రీరమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్‌లో ఉంటున్న ఆమె ఇటీవల గృహ ప్రవేశ శుభకార్యానికి హైదరాబాద్ వచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురిని మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

హైవేపై ఘోర ప్రమాదం