ద్వారకాతిరుమల: అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన ద్వారకాతిరుమల సర్పంచ్ కుంటం స్వర్ణలతకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఊరట లభించింది. దీంతో తిరిగి ఆమె పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్‌గా పదవీ బాద్యతలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గ్రామానికి చెందిన నిమ్మగడ్డ అముక్త గతేడాది జనవరి 29న స్పందనలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అధికారిగా జంగారెడ్డిగూడెం డీఎల్‌పీఓను నియమిస్తూ ఫిబ్రవరి 5న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ జరిపిన అధికారులు సర్పంచ్ రూ.53,57,376 నిధులను దుర్వినియోగం చేసినట్టు తేల్చారు. ఆ నిధుల రికవరీతో పాటు, 6 నెలల పాటు సస్పెన్షన్ ఎందుకు చేయకూడదో వివరణ ఇవ్వాలని అదే ఏడాది జూలై 29న సర్పంచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని, తనపై ఏవిధమైన చర్యలు తీసుకోవద్దని ఆగస్టు 9న వివరణ ఇచ్చారు. వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సర్పంచ్ స్వర్ణలతను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ, దుర్వినియోగం అయిన నిధులను 15 రోజుల లోపు చెల్లించాలని గతేడాది అక్టోబర్ 15న కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఆ చర్యలను తొలగించాలని కోరుతూ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించగా, తదుపరి విచారణ ముగిసే వరకు ఆమైపె ఉన్న చర్యలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అదేనెల 26 న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అమలు చేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. దాంతో సర్పంచ్‌గా స్వర్ణలత బాధ్యతలు స్వీకరించారు.
సస్పెన్షన్, నిధుల రికవరీ ఆదేశాలు తాత్కాలికంగా నిలుపుదల
కలెక్టర్ ఉత్తర్వులతో పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్