
వాన రాకడ మీ అరచేతిలో
వెదర్ యాప్‌తో
ఎన్నో ప్రయోజనాలు
వెదర్ యాప్ అందుబాటులోకి రావడంతో ముఖ్యంగా రైతులకు అనేక ప్రయోజనాలున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. రైతులకు వర్ష సూచన తెలియకపోవడంతో విత్తనాలు, ఎరువులు వేసుకోవడం పురుగుమందుల పిచికారి చేసిన వెంటనే వర్షం రావడం వల్ల నష్టపోతున్నారు. వెదర్ యాప్‌తో వర్ష సూచనలు తెలుసుకోవడం ద్వారా అప్రమత్తమయ్యే అవకాశాలు ఉంటాయి.
– జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం
●
భీమవరం : గతంలో వాతావరణం సమాచారం రైతులకు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడ్డ లక్షలాదిమంది తీవ్రంగా నష్టపోయేవారు. వరి నారుమడి వేసిన నాటి నుంచి పంట చేతికి వచ్చేవరకు వర్షాలతో రైతన్నకు ఇబ్బందులు తప్పేవికావు. వర్షాలు, ఈదురు గాలుల తీవ్రతకు పంటకు తీవ్ర నష్టం ఏర్పడేది. పిడుగులు వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ప్రాణాలు కోల్పోయేవారు. పిడుగు పడే అవకాశం ముందుగా తెలుసుకునే అవకాశం లేక పోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగేది. భారీ వర్షాలతో పంటచేలు దెబ్బతినేవి. ఇలాంటి పరిస్థితికి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెరదించింది. గ్రామ పంచాయతీ స్థాయిలోనే వాతావరణం అంచనాలు విడుదల చేస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్ నెట్ సౌకర్యం ఉంటే వాతావరణం వివరాలు తెలుసుకుని అప్రమత్తమయ్యే వీలు ఏర్పడింది.
విత్తనం వేయడం దగ్గర నుంచి ఎరువులు వేసే సమయం, పంట మాసూళ్లు సమయంలో వర్షం వల్ల రైతుకు నష్టం వాటిల్లేది. ఇలాంటి నష్టాల నుంచి బయటపడేందుకు ’మేఘదూత్’ యాప్ రూపుదిద్దుకుంది. ’మేఘదూత్’ సాయంతో వారం రోజులు ముందుగానే నాలుగైదు రోజుల వాతావరణ మార్పులు, వర్షసూచన, ఉష్ణోగ్రత వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా ప్రతి మంగళ, శుక్రవారాల్లో వాతావరణ సమాచారంతో ఆగ్రోమెట్ ఫీల్డ్ యూనిట్లు(ఏఎంఎఫ్‌యూ) రైతులకు మెసేజ్ పంపుతున్నాయి.
పిడుగు సమాచారం కోసం వజ్రపాత్
గూగుల్ ప్లేస్టోర్ నుంచి వజ్రపాత్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ గుర్తుపై నొక్కితే రెండు రకాల సమాచారం వస్తుంది. ఎడమ వైపు పిడుగు గుర్తు, పిడుగు సమాచారం కనిపిస్తుంది. అక్కడ నొక్కితే మనమున్న ప్రాంతం సహా మ్యాప్ కనిపిస్తుంది. రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్స్ వలయాలు కనిపిస్తాయి. వీటి పక్కనే 8, 15, 30 అంకెలుంటాయి. ఈ అంకెల ప్రకారం అంటే కొద్దిసేపట్లో ఎంత దూరంలో పిడుగు పడే అవకాశముందో చూపిస్తుంది. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తమయ్యే అవకాశముంటుంది.
రెయిన్ అలారం
గూగుల్ ప్లేస్టోర్ నుంచి రెయిన్ అలారం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారుడికి అందిన సమాచారం మేరకు అతను ఉండే ప్రాంతానికి సమీపంలోని 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ వర్షం పడే అవకాశముందో తెలుసుకోవచ్చు. వర్షం ముప్పును ముందుగా గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది.
యాప్‌లతో రైతులను అప్రమత్తం చేస్తున్న వాతావరణ శాఖ