నేడు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

నేడు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి భూమిపూజ

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

నేడు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి భూమిపూజ పంచారామాలకు ప్రత్యేక బస్సులు పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌కు కమిషనరేట్‌ జట్టు ఎంపిక రేపు బాక్సింగ్‌ ఎంపికలు వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు

● ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి రాక

కాజీపేట: కాజీపేట 63వ డివిజన్‌ విద్యానగర్‌కాలనీలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ స్కూల్‌ నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు స్థలాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు, మాజీ కార్పొరేటర్లు విజయశ్రీ రజాలీ, జక్కుల రవీందర్‌ యాదవ్‌, గుంటి కుమారస్వామి, ఎండీ రహమతుల్లా, ఎంవీ సవిత, ఎండీ అంకూస్‌ తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ: కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్‌ భూక్యా ధరంసింగ్‌ తెలిపారు. రామప్ప శ్రీ రామలింగేశ్వరాలయం, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క–సారలమ్మ, మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, బొగత జలపాతం, కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానాలు, హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, గోల్కొండ కోట, ఆంధ్రప్రదేశ్‌లోని పంచరామ క్షేత్రాలు అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోటకు ప్రత్యేక బస్సులు సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. వీటితో పాటు తమిళనాడులోని అరుణాచలానికి కూడా ప్రత్యేక బస్సులు నడపుతున్నట్లు పేర్కొన్నారు. భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా శబరిమలైకు ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం 8977781103, 9493882464, 9949193893 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

● కెప్టెన్‌గా ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌

హసన్‌పర్తి: హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌ సిటీలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ఐదో రాష్ట్రస్థాయి పోలీస్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌–2026లో పాల్గొనేందుకు వరంగల్‌ కమిషనరేట్‌ తరఫున క్రికెట్‌ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు గీసుకొండ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.విశ్వేశ్వర్‌ కెప్టెన్‌గా వహించనున్నారు. ఈసందర్భంగా ఎంపికై న క్రికెట్‌ జట్టును మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అభినందించి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌ బాక్సింగ్‌ హాల్‌లో ఈనెల 12న ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్‌ ఎలైట్‌ పురుషుల, మహిళల బాక్సింగ్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌కుమార్‌, కమలాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు రూ.300 ఎంట్రీ ఫీజు చెల్లించి ఉదయం 7 గంటల వరకు హాజరుకావాలని, ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎంపికై న బాక్సర్లు ఈనెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు.

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పలు వ్యవసాయ ఉత్పత్తులకు మంగళవారం మంచి ధరలు లభించాయి. ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధర కంటే కొన్ని పంటలకు అధిక ధరలు, మరికొన్ని పంటలకు తక్కువ ధరలు పలికాయి. మక్కలకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,410 కాగా, గరిష్టంగా రూ.3,115 ధర లభించింది. వేరుశనగకు మద్దతు ధర 7,517 కాగా, రూ.7,510 ధర నమోదైంది. పత్తికి మద్దతు ధర రూ.8,667 కాగా, జెండా పాట ద్వారా రూ.8,760 ధర పలికింది. పసుపు గోల రకానికి రూ.18,500, కాడ రకం రూ.18,000 ధర లభించింది. మిర్చిలో దీపిక రకానికి గరిష్టంగా రూ.30వేల ధర పలికిందని మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement