ఎల్కతుర్తి: మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. ఎగువప్రాంతం నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శుక్రవారం తెల్లవారు జామునుంచి కురిసిన భారీ వర్షానికి పత్తి చేలల్లో వర్షపు నీరు నిలిచింది. పూత నుంచి కాయ దశలో ఉన్న పత్తి పంట వాన నీటితో పాడైపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వరద కారణంగా పత్తి ఎర్రబడి నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
పంట నష్టం..
జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట శివారులో సాగు చేసిన పత్తి, శాంతినగర్‌లో సాగు చేసిన పత్తిపంట కోతులనడుమ, వల్బాపూర్‌లో జక్కరాజు కిష్టారావు అనే రైతుకు చెందిన 5 ఎకరాల పత్తి ఎర్రబడింది. సూరారం గ్రామంలో సాగుచేసిన పత్తి, కందిపంటల్లో భారీగా వర్షపు నీరు, వరదనీరు వచ్చి చేరింది. దీంతో రైతులకు పంటపెట్టుబడి వచ్చే అవకాశం కూడా లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని గ్రామాల్లో పత్తిపంట నేలవాలడంతో పాటు ఎర్రబడింది. మరికొన్ని చోట్ల పత్తి మొక్కలు నేలవాలి పంటకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు పంటలు పరిశీలించారు.
రైతులకు సూచనలు..
వర్షాల నేపథ్యంలో రైతులకు వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్ రైతులకు సూచనలిచ్చారు.
● పంట చేలల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి.
● 19.19.19 లీటర్ నీటికి 5 గ్రాములు ఆగ్రోమిన్ మాక్స్ లేదా ఫార్ములా–4 ద్రావణాన్ని లీటర్ నీటికి 2.5 గ్రాములు పంటపై పిచికారీ చేయాలి.
● నానో యూరియా లీటర్ నీటికి 4 మీల్లిలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి.
● మొక్కలు ఎక్కువగా వడలిపోతే కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి 3 గ్రాములు, ప్లాంటమైసిన్ మందును 10 లీటర్ల నీటికి 1 గ్రా మ్ కలిపి మెక్కల మొదళ్లలో తడిచేలా పోయాలి.
చేలల్లో నిలిచిన వరదనీరు
పలు గ్రామాల్లో ఎర్రబడిన పత్తి
ఈదురు గాలులతో కూడిన వర్షం
విద్యుత్ సరఫరాకు అంతరాయం


