సాక్షిప్రతినిధి, వరంగల్ : ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు వేయడం వరకే పరిమితం కాకుండా.. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? వాటిని ఎలా నివారించాలి? బ్లాక్‌స్పాట్లు ఎక్కడున్నాయి? పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలు, డ్రైవర్లు ఎవరు? ప్రమాదం తర్వాత క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేరుస్తున్నారా? వంటి అంశాలపై ఇక ప్రత్యేక పర్యవేక్షణ ఉండనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’(టీజీ–టీఎంఎఆర్‌ఎస్ (టీజీ–టీమార్స్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తోపాటు మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలపై ఈ వ్యవస్థ ప్రభావం చూపనుంది.
కొత్తగా జేసీపీ, అదనపు ఎస్పీలు..
ట్రాఫిక్ నిర్వహణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, హైవే పెట్రోలింగ్, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు, డేటా విశ్లేషణ, ప్రాసిక్యూషన్, రైలు ప్రయాణ భద్రత తదితర అంశాలు టీజీ–టీమార్స్ పరిధిలో ఉంటాయి. ట్రాఫిక్ విభాగాలకు ఒకే విధమైన ప్రమాణాలు, సాంకేతికత, శిక్షణ, డేటా విశ్లేషణ, సమీక్ష విధానం ఉండేలా బ్యూరో పనిచేయనుంది. స్థానికంగా ట్రాఫిక్ విభాగాలపై సీపీలు, ఎస్పీల ఆపరేషనల్ కంట్రోల్ యథాతథంగా ఉంటుంది. అదనంగా పోలీస్ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)ను నియమించనున్నారు. జిల్లాల్లో అదనపు ఎస్పీ (ట్రాఫిక్) బాధ్యతలు చూస్తారు. జంక్షన్లు, సిగ్నళ్లు, రహదారి ఆక్రమణలు, ఈ–చలాన్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల విశ్లేషణ వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు.
ప్రమాదం జరిగితే ‘క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్’
ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే ఉన్న సిబ్బందిలో ఒకరిని రోడ్ క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్‌గా నియమించాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం, ప్రాంతాన్ని భద్రపరచడం, క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకోవడం, ప్రమాద వివరాలను ఈ–డీఏఆర్‌లో నమోదు చేయడం ఆయన బాధ్యత. ప్రమాదానికి అసలు కారణాలను గుర్తించి, పునరావృతం కాకుండా చర్యలు సూచించేలా దర్యాప్తు సాగనుంది.
హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్..
మరణం లేదా తీవ్ర గాయాలకు దారితీసిన ప్రమాదాలను పోలీసు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, రహదారి యాజమాన్య సంస్థ ఇంజనీర్, అవసరమైతే వైద్యాధికారి కలిసి పరిశీలిస్తారు. డ్రైవర్ తప్పిదం, వాహన లోపం, రోడ్డు పరిస్థితులు తదితర కారణాలను విశ్లేషించి నివేదిక రూపొందిస్తారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఓఆర్‌ఆర్, నోటిఫై చేసిన రాష్ట్ర రహదారులపై ప్రత్యేక హైవే పెట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్, ప్రత్యేక పెట్రోల్ వాహనం ఉంటాయి. డ్యాష్‌బోర్డ్ కెమెరా, ఏఎన్‌పీఆర్, స్పీడ్ డిటెక్షన్, ఈ–చలాన్ సదుపాయాలతో పనిచేస్తాయి. స్పీడ్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, లేన్ ఉల్లంఘనలు, ఓవర్‌లోడింగ్ తదితరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపడుతారు. ఈ–చలాన్లు, ప్రమాదాలు, పెట్రోలింగ్ డేటాను విశ్లేషించి హైరిస్క్ కా రిడార్లు, క్రిటికల్ జంక్షన్లు, రెడ్‌స్పాట్లు, బ్లాక్‌స్పాట్లు గుర్తించనున్నారు. ఇక మోటార్ వెహికల్ చట్టాల కింద వసూలయ్యే కాంపౌండింగ్ ఫీజు/జరిమానాల్లో 40 శాతాన్ని ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక నిధికి జమ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రమాదం జరిగాక కాదు, ముందే మేల్కొనే వ్యవస్థ..
ట్రాఫిక్, రోడ్డు–రైలు భద్రతకు
ప్రత్యేక బ్యూరో
పోలీస్ కమిషనరేట్, జిల్లాల్లో అమలు.. జాయింట్ కమిషనర్, అదనపు ఎస్సీలు
రోజువారీ కంట్రోల్ సీపీలు, ఎస్పీలదే.. పర్యవేక్షణ టీజీఎంఏఆర్‌ఎస్‌ది
ప్రతీ ఘోర ప్రమాదంపై బహుళ శాఖల దర్యాప్తు.. హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్


