● డీఎంహెచ్‌ఓ అప్పయ్య
దామెర: చిన్నారులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. మండలంలోని ఒగ్లాపూర్, ముస్త్యాలపల్లి అంగన్‌వాడీ సెంటర్లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ రీచ్ వ్యాధినిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా టీకాలు వేసుకున్న పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏఎన్‌సీ నమోదు చేసుకున్న మహిళలతో మాట్లాడుతూ ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందశాతం ఏఎన్‌సీ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే డెలివెరీ చేసుకోవాలని సూచించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, పిల్లలు, తల్లులు ఉన్నారు.


