ఖిలా వరంగల్: క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.రామచంద్రం అన్నారు. శనివారం వరంగల్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల క్రీడామైదానంలో వాగ్దేవి కళాశాల ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేయూ యూనివర్సిటీ అండ్ కాలేజ్ 2026–27 క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ రామచంద్రం హాజరై క్రీడోత్సవాలను ప్రారంభించారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 780 మంది మహిళా క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. 21 తేదీ వరకు పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ టి.శాస్త్రి, వాగ్దేవి కళాశాల డైరెక్టర్ వాణిదేవి, హెచ్.సుదర్శన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సునీల్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14, 17, 19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలు శనివారం ముగిశాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో రజిత, రాజేశ్వరి, స్వరూప, పార్థసారథి, ప్రశాంత్, శేఖర్, సురేశ్, రజనీకాంత్, బాలమురళీకృష్ణ పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కొనసాగుతున్న ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూలమహాగణపతిని శ్రీహేరంబగణపతిగా అలంకరించి దూర్వాయుగ్మ పూజ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలగణపతిని శ్రీహేరంబగణపతిగా అలంకరించి దూర్వాపత్రాలతో (గరిక) లక్షవినాయక నామాలతో లక్షగరిక పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కాగితోజు శివలింగాచారి, సోమ సురేశ్, ఎర్రోళ్ల వంశీ, కట్ల రాజు, వృక్షాల చంద్రశేఖర్ ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం నృత్యగురువు బొంపల్లి సుధీర్‌రావు శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు అలరించాయి.
కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలోని మణికంఠ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 316 కిలోల బాహుబలి లడ్డూను తయారు చేసి పెద్ద ఎత్తును ఊరేగించారు. లడ్డూదాత బయ్య స్వప్న–అశోక్ ఇంటి వద్ద పోచమ్మ గుడి నుంచి మహాగణపతి మండపం వరకు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, భక్తి పాటలు, కీర్తనలతో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు బాహుబలి లడ్డ్డూను ఆసక్తిగా తిలకించారు.
కమల గణనాథుడికి 108 రకాల నైవేద్యం
వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలోని సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో కొలువుదీరిన కమల గణనాథుడికి ఈ ఏడాది రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. శనివారం సంస్థ అధినేత, వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు.


