పాఠశాలల్లో ‘స్వచ్ఛత పఖ్వాడా’ | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో ‘స్వచ్ఛత పఖ్వాడా’

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

హరిత జిల్లాగా తీర్చిదిద్దుదాం..

ఈనెల 15 వరకు పలు కార్యక్రమాలు

కాళోజీ సెంటర్‌: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ‘స్వచ్ఛత పఖ్వాడా’ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ఆవరణ, తరగతి గదులను శుభ్రం చేసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఈనెల 1 నుంచి 15 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, జిల్లాలోని 13 మండలాలలో పరిధిలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు 532 ఉన్నాయి. వీటిలో 32,542 మంది విద్యార్థులు చదువుతున్నారు.

కార్యాచరణ ఇలా..

● అవగాహన, పారిశుద్ధ్య పనులు ఈ నెల 1 నుంచి 4 వరకు నిర్వహించారు. తొలిరోజు స్వచ్ఛత ప్రతిజ్ఞతో డ్రైవ్‌ ప్రారంభమైంది. నీటి సంరక్షణపై ‘గ్రీన్‌ స్కూల్‌ డ్రైవ్‌’, ఎస్‌ఎంసీ/పీటీఏం సమావేశాల ద్వారా తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన వంటశాలలను శుభ్రం చేశారు.

● బాహ్య ప్రచారం, హ్యాండ్‌ వాష్‌ కార్యక్రమాలు ఈనెల 5 నుంచి 8 వరకు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై చైతన్యం కల్పించారు. కమ్యూనిటీ అవుట్‌రీచ్‌, సబ్బుతో చేతులు కడుక్కోవడం, దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్ల వసతి పునరుద్ధరించారు.

● పోటీలు, ప్రదర్శనలను ఈనెల 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. వ్యాసరచన, క్విజ్‌, చిత్రలేఖనం, మోడల్‌ మేకింగ్‌ వంటి స్వచ్ఛతా పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థులు రీసైకిల్‌ చేసిన వస్తువులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

● కార్యాచరణ, బహుమతుల ప్రదానం కార్యక్రమాలు ఈనెల 13 నుంచి 15 వరకు నిర్వహిస్తారు. బాలసభలు, స్కూల్‌ క్యాబినెట్‌ సమావేశాల ద్వారా భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందిస్తారు. చివరి రోజున ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేసి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.

జియోట్యాగింగ్‌ ఫొటోలు తప్పనిసరి

పాఠశాలల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని జియోట్యాగింగ్‌ ఫొటోలు, వీడియోలతో డాక్యుమెంట్‌ చేయాల్సి ఉంటుంది. రోజువారీ ఫొటోలను సంబంధిత మండల ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లకు పంపించాలి. అత్యుత్తమ ఫొటోలను పాఠశాల పేరుతో 80081 08365 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజు చేసే కార్యక్రమం కాదు. అది ప్రతీ ఒక్కరి నిత్య జీవితంలో భాగం కావాలి. అందరి భాగస్వామ్యంతో జిల్లాను స్వచ్ఛ, హరిత జిల్లాగా తీర్చిదిద్దుదాం.

– బి.రంగయ్యనాయుడు, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement