న్యూశాయంపేట: పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలను పర్తిప్రతిష్ఠించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ కలెక్టరేట్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలు, హానికరమైన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో నీరు కలుషితం అవుతుందని తెలిపారు. మట్టి విగ్రహాలను వినియోగిస్తే పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సహజ వనరులను కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, డీడబ్ల్యూఓ రాజమణి, అధికారులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్‌ను కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాభ్యాసానికి మధ్యలో దూరమైన వారు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించాలని సూచించారు. అడ్మిషన్లకు ఈనెల 15 వరకు గడువుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, డీఈఓ రంగయ్యనాయుడు, అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ రమేష్‌రెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం, ఉల్లాస్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
హియరింగ్ ప్రక్రియ పరిశీలన..
వరంగల్ చౌరస్తా: ఎస్‌ఐఆర్‌లో భాగంగా వరంగల్ ఏనుమాముల పరిధిలోని బాలాజీనగర్‌లో నిర్వహించిన హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యంతరాలు, దావాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. హియరింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమాచారం, సహాయాన్ని అందించాలని పేర్కొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


