నర్సంపేట: కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించడంలేదు. మధ్యాహ్నం 12గంటలైనా కార్యాలయం తెరువని పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం నుంచే వివిధ పనుల నిమిత్తం వచ్చిన కార్మికులు గంటల తరబడి నిరీక్షించి నిరాశతో వెను తిరగాల్సిన పరిస్థితి నర్సంపేట కార్మిక శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులు తమ లేబర్ కార్డులు, పెన్షన్, ప్రమాదబీమా, ఇతర సంక్షేమ పథకాలపై అవసరంపై పనుల కోసం ప్రతీ రోజు పట్టణంలోని కార్యాలయానికి వస్తుంటారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకే కార్యాలయం తెరవాలి. కానీ బుధవారం 11.55నిమిషాల వరకు కూడా అధికారులు, ఇతర సిబ్బంది రాలేదు. దీంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఇదే విషయంపై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుమతికి రెండు సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. ఆఫీస్ సబార్టినేట్ మధుకు ఫోన్ చేయగా ఆఫీస్ మార్పిడి కోసం కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లామని, అందుకే ఆలస్యం అయిందని, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సెలవులో ఉన్నట్లు సమాధానమిచ్చారు.
కార్మిక శాఖ అధికారులు,
సిబ్బంది నిర్లక్ష్యం
ఇబ్బందుల్లో కార్మికులు


