న్యూశాయంపేట: ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం తన రచనల ద్వారా పోరాటంం సాగించిన గొప్ప కవి కాళోజీ అని కొనియాడారు. తన రచనల ద్వారా మహనీయుడిగా కాళోజీ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. తెలుగు కవిత్వం ఉన్నంత వరకు కాళోజీ ప్రజల గుండెల్లో ఉంటారని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.వీ.గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీపీఆర్‌ఓ ప్రేమలత, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
గొప్ప దార్శనికుడు కాళోజీ
కాళోజీ సెంటర్ : కాళోజీ గొప్ప దార్శనికుడని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. బుధవారం ఇంటర్ విద్య కార్యాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ.. కాళోజీ బహుభాషావేత్త అని చిన్నతనం నుంచే తెలుగు చదివినప్పటికీ, మరాఠీ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో కవితలు రాసారన్నారు. కాళోజీ నారాయణరావు రచనలు సమాజా నికి ప్రేరణ అన్నారు. పుట్టుక నీది చావునీది బతుకంతా దేశానిది అనే మాట ఆయన దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు భుజేందర్ రెడ్డి, సాజిత్, జనార్ధన్, కొమురారెడ్డి, కార్యాలయ సిబ్బంది శేఖర్, సందీప్, శ్రీకాంత్ పాల్గొన్నారు.


