180 పెండింగ్‌ దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

180 పెండింగ్‌ దరఖాస్తులు

Sep 10 2026 3:38 AM | Updated on Sep 10 2026 3:38 AM

నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో కమిషనర్‌కు సంబంధించిన డిజిటల్‌ కీ నిలిచిపోవడంతో 25 రోజులుగా ఇంటి నిర్మాణ అనుమతులు, ఇంటి నంబర్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్‌ తదితర సేవలకు సంబంధించి 180వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపాలిటీలో సిటిజన్‌ చార్టు ఉన్నప్పటికీ పనులు జరగకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్‌ హన్మకొండ శ్రీధర్‌ హైదరాబాద్‌లోని సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి డిజిటల్‌ కీ విడుదల చేయాలని మంగళవారం అధికారులకు వినతిపత్రం అందించారు.

సిటిజన్‌ చార్ట్‌ ప్రకారం సర్టిఫికెట్ల జారీ

వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పలు రకాల సర్టిఫికెట్లు నిబంధనలకు అనుగుణంగా జారీ చేస్తున్నారు. అయితే కార్యాలయంలో సిటిజన్‌ చార్ట్‌ బోర్డు ఏర్పాటు చేయలేదు. గత ఏప్రిల్‌ నుంచి ఆగస్టు చివర వరకు బర్త్‌ సర్టిఫికెట్లకు 176 దరఖాస్తులు రాగా 162 జారీ చేశారు. 14 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లకు 37 దరఖాస్తుల్లో 35 జారీ చేశారు. జారీ కానివి పరిశీలనలో ఉన్నాయి. నిర్ణీత తేదీలోగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సిటిజన్‌ చార్ట్‌ లేకపోవడంతో పట్టణ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. అదే విధంగా భవన నిర్మాణ అనుమతులకు 6 దరఖాస్తులు రాగా.. 4 అనుమతులిచ్చారు. ట్రేడ్‌ లైసెన్సులు మొత్తం 352 ఉన్నాయి. ఇందులో 62 గత ఏప్రిల్‌ నుంచి దరఖాస్తులు రాగా ఇందులో ప్రస్తుతం 8 పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్నవాటిలో పెట్రోల్‌ బంక్‌, రెస్టారెంట్లు, టీ స్టాల్‌, డీసీ తండాలో చిన్న కిరాణ షాపులవి ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టణ పరిధిలోని డీసీ తండా శివారు మొత్తం 7 తండాల్లో భవన నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే తండా వాసులు భవన నిర్మాణాలు చేసుకుంటున్నారని అధికారులు చెపుతున్నారు. తమకు మున్సిపాలిటీతో సంబంధం లేదని గ్రామ పంచాయతీ అనే డిమాండ్‌ ఉండడంతో అధికారులు సైతం తండా వాసులపై ఒత్తిడి తేలేకపోతున్నట్లు సమాచారం.

మున్సిపాలిటీలో నిలిచిన సేవలు

సిటిజన్‌ చార్ట్‌ ఉన్నా.. జరగని పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement