పత్తిదే పైచేయి | - | Sakshi
Sakshi News home page

పత్తిదే పైచేయి

Aug 24 2026 1:25 AM | Updated on Aug 24 2026 1:25 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. లోటు వర్షపాతం, వరి కంటే తక్కువ నీటితో పండే పత్తి, పప్పుధాన్యాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే పత్తి, పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరగగా.. వరి 66.88 శాతానికే పరిమితమైంది. వ్యవసాయశాఖ విడుదల చేసిన వానాకాలం–2026 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. మొత్తం 85.78 శాతం సాగు పూర్తయ్యింది.

అంచనాలు మించిన పత్తి సాగు..

ఉమ్మడి వరంగల్‌లో సాధారణంగా 5,54,387 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఈసారి ఇప్పటికే 5,61,578 ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ అంచనాలో 101.30 శాతం మేర సాగు నమోదైంది. ముఖ్యంగా భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పత్తి సాగు సాధారణ అంచనా లను మించింది. భూపాలపల్లిలో 98,764 ఎకరాల సాధారణ సాగుకు 1,09,442 ఎకరాల్లో పత్తి వేశారు. జనగామలో 1,37,145 ఎకరాల అంచనాకు 1,38,325 ఎకరాల్లో సాగు చేశారు.

పెరిగిన పప్పుధాన్యాల సాగు..

పప్పుధాన్యాల సాగు భారీగా పెరగడం ఈసారి మరో ఆసక్తికర పరిణామం. సాధారణంగా 15,715 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతాయని అంచనా ఉండగా.. ఇప్పటికే 60,863 ఎకరాల్లో సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే 387.29 శాతం ఎక్కువగా సాగైంది. మహబూబాబాద్‌లో సాధారణ అంచనా 4,696 ఎకరాలు కాగా.. 23,815 ఎకరాల్లో సాగు చేశారు. వరంగల్‌లో 1,355 ఎకరాల అంచనాకు 11,742 ఎకరాల్లో, భూపాలపల్లిలో 352 ఎకరాల అంచనాకు గాను 9,670 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగయ్యాయి. జనగామలో 7,777 ఎకరాల అంచనాకు 11,059 ఎకరాల్లో సాగు నమోదైంది. తక్కువ నీటితో సాగు, వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటను కొనసాగించే అవకాశం ఉండడంతో రైతులు పప్పుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

వరిసాగు 66.88 శాతం మాత్రమే

సాధారణంగా 9,21,445 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా కాగా 6,16,267 ఎకరాల్లో మాత్రమే సాగైంది. దీంతో సాధారణ సాగు విస్తీర్ణంలో 66.88 శాతం మాత్రమే నమోదైంది. అధిక నీటి అవసరం ఉండే వరి సాగు.. వర్షపాతం లోటు నెలకొన్న ప్రాంతాల్లో కొంత మందగించింది.

మానుకోట ముందంజ.. భూపాలపల్లి టాప్‌

మొత్తం సాగు విస్తీర్ణం పరంగా మహబూబాబాద్‌ ముందు ఉంది. జిల్లాలో 3,71,318 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,30,176 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే సాగు ప్రగతిలో భూపాలపల్లి 94 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జనగామ 91 శాతం, మహబూబాబాద్‌ 89 శాతం, హనుమకొండ 85 శాతం, ములుగు 80 శాతం, వరంగల్‌లో 72 శాతం చొప్పున సాగు నమోదైంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 5,61,578 ఎకరాల్లో కాటన్‌ క్రాప్‌

వరి 6,16,267, పప్పుధాన్యాలు 60,863 ఎకరాల్లో సాగు

ఈసారి 15.93 లక్షలకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు

వర్షాభావ పరిస్థితులతో

పంటమార్పిడికి రైతుల మొగ్గు

వర్షాభావం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్‌ 1 నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 430.1 మిల్లీమీటర్లు కాగా.. నాలుగు జిల్లాల్లో తీవ్ర లోటు నమోదైంది. హనుమకొండలో సాధారణ వర్షపాతం 547.8 మిల్లీమీటర్లకు 298.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 45.5 శాతం లోటు నమోదైంది. వరంగల్‌లో 43.1 శాతం, జనగామలో 43.2 శాతం, మహబూబాబాద్‌లో 30.8 శాతం లోటు ఉంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వరుసగా 8.5, 7.9 శాతం స్వల్ప లోటు ఉన్నా.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం పరిధిలోనే ఉన్నాయి. మహబూబాబాద్‌లో 6.02 మీటర్లు, వరంగల్‌లో 6.65, ములుగులో 7.11, హనుమకొండలో 7.71, జనగామలో 9.14 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. భూపాలపల్లిలో మాత్రం భూగర్భజల మట్టం 11.98 మీటర్ల లోతున చేరడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది.

అవగాహనతో పంటల మార్పు

వర్షపాతం లోటు, తక్కువ నీటి లభ్యత, ఎల్‌నినో ప్రభావంపై వ్యవసాయశాఖ చేపట్టిన అవగాహన సదస్సులు ఫలించాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు కంటే తక్కువ నీటితో సాగయ్యే పత్తి, పప్పుధాన్యాల వైపు రైతుల మొగ్గు చూపారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్‌సీడ్స్‌, పప్పుధాన్యాల పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం.

– దోమ ఆదిరెడ్డి, ఏడీఏ, హనుమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement