పూర్తిస్థాయిలో అందని యూనిఫామ్‌ | - | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయిలో అందని యూనిఫామ్‌

Aug 24 2026 1:25 AM | Updated on Aug 24 2026 1:25 AM

పూర్తిస్థాయిలో అందని యూనిఫామ్‌

విద్యారణ్యపురి: విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫామ్‌ అందలేదు. దీంతో హనుమకొండ జిల్లాలోని చాలా మంది విద్యార్థులు గత సంవత్సరం యూనిఫామ్‌తో, లేనివారు సాధారణ దుస్తులతో పాఠశాలలకు హాజరవుతున్నారు. ఈసారి యూనిఫామ్‌ మార్చడంతో ఆలస్యంగా జిల్లాకు క్లాత్‌ వచ్చింది. సెర్ప్‌–డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు కుట్టు బాధ్యతలను అప్పగించారు. 332 పాఠశాలల్లో 14,350 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెప్మా ద్వారా 136 పాఠశాలల్లోని 13,487 మంది విద్యార్థుల కోసం సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపులకు క్లాత్‌ అందించారు. ఈనెల 13 వరకు 5,787 మంది విద్యార్థులకు మొదటి జత స్కూల్‌ యూనిఫామ్‌ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 21 వరకు మరికొన్ని పాఠశాలలకు పంపిణీ చేసినట్లు సమాచారం. కాజీపేట మండలంలో 35 పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలకు కూడా మొదటి జత స్కూల్‌ యూనిఫామ్‌ రాలేదని ఎంఈఓ మనోజ్‌ తెలిపారు. ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారు. హనుమకొండ డీఈఓ కార్యాలయం పక్కనే ఉండే సుబేదారి ప్రభుత్వ హైస్కూల్‌, ప్రైమరీ స్కూల్‌, అలాగే లష్కర్‌బజార్‌ ప్రభుత్వ బాలికల హైస్కూల్‌కు కూడా ఒక స్కూల్‌ యూనిఫామ్‌ అందించలేదు. హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌ విద్యార్థులకు కూడా సరిపడా ఒక జత యూనిఫామ్‌ రాలేదు. ఆ స్కూల్‌లో 656 మంది విద్యార్థులు ఉన్నారు. 185 మంది బాలికల్లో 162 మందికి బాటమ్స్‌ వచ్చాయి. టాప్స్‌ రాలేదు. బాలురు 471 మంది ఉండగా, కొందరికి ఒక జత స్కూల్‌ యూనిఫామ్‌ రాలేదు. యూనిఫామ్‌ వచ్చిన తర్వాతే యూడైస్‌ ప్రకారం మిగిలిన విద్యార్థులకు అందజేస్తామని హెచ్‌ఎం పేర్కొంటున్నారు.

నాణ్యత లేని క్లాత్‌

విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌ క్లాత్‌ నాణ్యత లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంతకాలం మన్నికగా ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కొలతల ప్రకారం స్టిచ్చింగ్‌ చేయగా.. అక్కడక్కడా ర్యాండమ్‌గా విద్యార్థుల సైజ్‌ను బట్టి స్టిచ్చింగ్‌ చేశారని సమాచారం. జిల్లాకు వచ్చిన షర్ట్స్‌ క్లాత్‌, బాలికల టాప్‌ క్లాత్‌ నాణ్యత విషయంపై తొలుత సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. క్లాత్‌ సరఫరా చేసిన సంస్థ నుంచి ఒకరు వచ్చి పరిశీలించి ఒకటి అర మార్చారని తెలుస్తోంది.

గతేడాది యూడైస్‌ ప్రకారమే క్లాత్‌ పంపిణీ..

గత విద్యాసంవత్సరం యూడైస్‌ ప్రకారమే పాఠశాలలకు యూనిఫామ్‌ క్లాత్‌ పంపిణీ చేశారు. దీంతో ఈవిద్యాసంవత్సరం పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపెరిగింది. కొత్తగా వచ్చిన ఆయా విద్యార్థులకు ఇప్పట్లో స్కూల్‌ యూనిఫామ్‌ అందే పరిస్థితి లేదు. దీనిపైన రాష్ట్ర ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో రెండో జత యూనిఫామ్‌ క్లాత్‌ ఇటీవల రాగా, ఆయా సెల్ఫ్‌ హెల్ప్‌గ్రూపులకు అందించారు. అది స్టిచ్చింగ్‌ దశలోనే ఉంది.

సాధారణ, గత సంవత్సరం దుస్తులతో

పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement