● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
పరకాల: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో పరకాలలోని రాజిపేటలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తిచేయాలని కోరారు.
మీ జీవిత లక్ష్యాలు ఏమిటి?
పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. బీకాం సీఏ, బీఏ, బీఎస్సీ డెయిరీ సైన్స్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్‌ను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మీ జీవిత లక్ష్యాలు ఏమిటని ప్రశ్నించారు.. మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉంటామని కొందరు, తల్లిదండ్రుల కలను సాకారం చేస్తామని మరికొందరు సమాధానం ఇచ్చారు. ఎక్కడి నుంచి కళాశాలకు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
నాగారంలో యూనిఫామ్ కుట్టుకేంద్రం పరిశీలన
మండలంలోని నాగారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాం కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కుట్టు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందని తెలుసుకున్నారు. యూనిఫామ్‌లో తయారీలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. పిల్లలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పరిసరాలను ఎప్నటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. అదనపు కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్‌డీఓ మేన శ్రీను, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రామకృష్ణ, సర్పంచ్ రమాదేవి పాల్గొన్నారు.


