ఎల్కతుర్తి: పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్ల లకు నాణ్యమైన విద్యనందించడమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించారు. నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌తో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి అవసరమైన కార్యాలయ భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. సుపరిపాలన అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి రూ.600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తవడం సంతోషకరమన్నారు. నాబార్డ్ నిధులతో అదనపు మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ నిర్మాణ పనులు కూడా చేపట్టినట్ల తెలిపారు. విద్యలో ప్రతిభ కనబర్చి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రులు సన్మానించి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, శ్రీకుడాశ్రీ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సామ్యనాయక్, డీఈఓ గిరిరాజ్‌గౌడ్, తహసీల్దార్ ప్రసాద్‌రావు, ఎంపీడీఓ విజయ్‌కుమార్, ప్రిన్సిపాల్ అనితాదేవి, అధ్యాపకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కేజీబీవీ నూతన భవనం ప్రారంభోత్సవం
తహసీల్దార్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ


