కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు పూర్తయినా..విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాం మెటీరియల్ ఇప్పుడిప్పుడే జిల్లాకు చేరుకుంటుంది. పాఠశాలల ప్రారంభం రోజున ఉచితంగా రెండు జతల యూనిఫాం, పుస్తకాలు అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నా.. ఒక పుస్తకాలు మాత్రమే సకాలంలో అందించారు. యూనిఫాం అందించడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విద్యార్థులు పాత దుస్తులతోనే జరుపుకునే పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 664 పాఠశాలలు ఉండగా 29,899 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఏప్రిల్ మాసంలోనే విద్యార్థుల కొలతలు తీసుకుని పభుత్వానికి ఇండెంట్ పంపించారు.
గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ,
పట్టణ ప్రాంతంలో మెప్మా..
జిల్లాలో దుస్తులను కుట్టే బాధ్యతలను గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ, పట్టణ ప్రాంతంలో మెప్మా పర్యవేక్షణలో మహిళా సంఘాల (ఎస్‌హెచ్‌జీ) గ్రూప్‌లకు బాధ్యతను అప్పగించారు. అయితే ప్రభుత్వం ఈసారి యూనిఫాం కలర్ మార్చి ఇవ్వాలనే ఆలోచన చేసింది. దీంతో జాప్యం జరిగి ఇప్పటి వరకు మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు క్లాత్ అందకపోవడంతో విద్యార్థులకు పంపిణీ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని ఆధికారులు తెలిపారు.
ఇప్పుడిప్పుడే ఎమ్మార్సీ కేంద్రాలకు..
జిల్లాలో ఇప్పుడిప్పుడే క్లాత్ (మెటీరియట్) ఎమ్మార్సీ కేంద్రాలకు చేరుకుంటుంది. దీంతో ఎప్పుడు యూనిఫాం తయారవుతుంది..ఎప్పుడు పాఠశాలలకు చేరుకుంటుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే యూనిఫాం తయారుకావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.
ఎమ్మార్సీలకు చేరుకుంటున్న
నూతన యూనిఫాం క్లాత్
పూర్తి దుస్తులు తయారవడానికి
మరో నెలరోజుల సమయం
పాత దుస్తులతోనే పంద్రాగస్టు
వేడుకలు
జిల్లాలో 664 పాఠశాలలు,
29,899 మంది విద్యార్థులు
కొత్తగా చేరిన విద్యార్థుల సంగతేంటి?
ఏప్రిల్ మాసంలో పాత యూడైస్ ప్రకారం 29,899 ఉన్న విద్యార్థులకు మాత్రమే అధికారులు దుస్తులకు సంబంధించిన మెటీరియల్ పంపిస్తున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం (2026–27)లో కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఎటూ తేలకుండా ఉంది. పాత విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫాం అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది.


