నల్లబెల్లి: ఓవైపు విషాదం..మరోవైపు ఉద్యమ జ్ఞా పకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత..ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం నల్లబెల్లి మండలకేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, న ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ..‘ఎంత కాలం బతికామన్నది కాదు..ఎట్లా బతికామన్నదే ముఖ్యం..సమాజంకోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నారు. నర్సంపేట లో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్‌రెడ్డి పేరు పెడుతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది.
పెద్ది లేని నర్సంపేట..
నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డిలేని మీటింగ్‌లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్‌నాయక్ నాయకులు గండ్ర జ్యోతి, సతీష్‌రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆ యనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు
భారీగా తరలివచ్చిన
గులాబీ నాయకులు, శ్రేణులు
ఉద్యమ సహచరుడిని తలుచుకుని
కేటీఆర్, హరీశ్‌రావు భావోద్వేగం


