సాక్షి, వరంగల్: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడంపై వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్) సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నారు. వివిధ వనరుల నుంచి లభించే సమాచారాన్ని అనుసంధానం చేసి.. అనుమానితుడి కదలికలు, సంబంధాలు, గత నేరచరిత్ర వంటి అంశాలను విశ్లేషించడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. ఇది కమిషనరేట్‌లో పూర్తిస్థాయిలో వినియోగించగలిగితే నేరాల పురోగతిలో కీలకమవుతుంది. డీజీపీ సీవీ ఆనంద్ కూడా ఈ సాంకేతికతను వాడాలని వరంగల్ పోలీసులకు సూచించారు.
నేరస్తులను ఎలా గుర్తిస్తారంటే..
ఒక ఆధారం.. ఎన్నో లింకులు: నిందితుడికి సంబంధించిన పేరు, గుర్తింపు వివరాలు, ప్రయాణం, ఫోన్ లేదా ఇతర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సంబంధిత రికార్డులను అనుసంధానించి పరిశీలించే అవకాశం ఉంటుంది.
కదలికలపై నిఘా: నిందితుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా.. అందుబాటులో ఉన్న ప్రయాణ, ఇతర సంబంధిత డేటా ఆధారాలతో అతడి కదలికలపై ఆధారాలు సేకరించవచ్చు.
పాత నేరచరిత్ర గుర్తింపు: ఒక కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తికి గతంలో ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయా? ఏదైనా నేర ముఠాతో సంబంధం ఉందా? వంటి అంశాలను పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది.
నేర ముఠాల గుట్టురట్టు: ఒకే వ్యక్తి కాకుండా పలువురు కలిసి నేరాలకు పాల్పడుతున్నప్పుడు.. వారి మధ్య ఉన్న సంబంధాలను డేటా విశ్లేషణ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది.
అంతర్రాష్ట్ర నేరాలకు చెక్: వరంగల్‌లో నేరం చేసి మరో రాష్ట్రానికి వెళ్లిన నిందితుడి విషయంలో స్థానిక సమాచారం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన సంబంధిత రికార్డులను కూడా పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది.
సైబర్ నేరాల్లో కీలకం..
ఆన్‌లైన్ మోసాల్లో నేరగాళ్లు తరచూ ఇతరుల బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, తప్పుడు గుర్తింపు వివరాలు ఉపయోగిస్తుంటారు. దీంతో అసలు నిందితుడిని చేరుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఇలాంటి కేసుల్లో వివిధ ఆధారాలను కలిపి చూడడం ద్వారా ఒక నంబర్ నుంచి ఖాతా.. అక్కడి నుంచి వ్యక్తి.. ఆ వ్యక్తి నుంచి నేర ముఠా వరకు దర్యాప్తును విస్తరించేందుకు సాంకేతిక ఆధారాలు తోడ్పడతాయి.
‘నాట్‌గ్రిడ్’తో నేరస్తుల జాడ
ఆధారాలను అనుసంధానించి
నిందితుల గుర్తింపు
వరంగల్ సైబర్, లా అండ్ ఆర్డర్
పోలీసులకు ప్రత్యేక శిక్షణ
కమిషనరేట్‌లో 2,400 సైబర్ కేసులు.. రూ.6.85 కోట్ల నష్టం
ఇక నేరస్తులను పట్టుకోవడంలో
పెరగనున్న మరింత వేగం
‘డేటా’తో దర్యాప్తులో వేగం..
గతంలో వివిధ విభాగాల నుంచి సమాచారం సేకరించేందుకు ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు అనుమతించిన పరిధిలో అందుబాటులో ఉన్న డేటాను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా దర్యాప్తులో కీలకమైన లీడ్స్ త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాట్‌గ్రిడ్‌ను అధీకృత సంస్థలు, చట్టపరమైన విధానాల ప్రకారం మాత్రమే వినియోగిస్తాయి. మొత్తంగా.. నేరగాడు ఎక్కడున్నాడన్నదే కాదు.. అతడి వెనుక ఎవరున్నారు? ఎక్కడికి వెళ్లాడు? గతంలో ఏం చేశాడు? ఎవరితో సంబంధాలున్నాయి? అనే ప్రశ్నలకు డేటా ఆధారంగా సమాధానాలు వెతికే అవకాశం నాట్‌గ్రిడ్‌తో లభిస్తుంది. వరంగల్ సైబర్ పోలీసులకు అందుతున్న శిక్షణతో సాంకేతిక ఆధారాల విశ్లేషణ మరింత బలోపేతమై.. సైబర్, ఆర్థిక, అంతర్రాష్ట్ర నేరాల దర్యాప్తులో నిందితుల గుర్తింపు వేగవంతమయ్యే అవకాశం ఉంది. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో ఇప్పటివరకు 2,400 సైబర్ కేసులు నమోదు కాగా.. రూ.6.85 కోట్లు నష్టపోయారు. పదుల సంఖ్యలోనే నిందితులు పట్టుకున్నారు. ఈ డేటాతో మరింత పురోగతి సాధించే అవకాశముంది.


