– 8లోu
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లా పోలీసింగ్ బాగుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం వరంగల్‌కు వచ్చిన ఆయన వరంగల్ నిట్‌లో పోలీ సు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పలు విషయాలను వెల్లడించారు.
ప్రజల భద్రతను బలోపేతం చేయాలి..
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. దోపిడీ కేసులు 29కు పెరగగా, సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కు, 2026 జనవరి–జూలైలోనే 119 కేసులుగా నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదు కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన 117 కేసులు నమోదు అయినట్లు డీజీపీకి అధికారులు వివరించారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను మరింత విస్తరించి ప్రజల భద్రతను బలోపేతం చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. చోరీలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ శ్వేత వివరించగా.. వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు.
డ్రగ్స్, సైబర్ మోసాలపై పీపీటీ..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) టీ–స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీ ఎన్.శ్వేత కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ పనితీరు, నేరాల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల భద్రత, ఆర్థిక నేరాల ధోరణులు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అధిక లాభాల ఆశతో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇలాంటి వాటికి దూరంగా సైబర్ మోసాలకు తావుండదని చెప్పారు.
పిల్లలే టార్గెట్.. గ్రామాలకూ డ్రగ్స్..
డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని డీజీపీ హెచ్చరించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తిస్తున్నామని, అయితే కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసింగ్ మరింత ప్రజా కేంద్రంగా..
మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మార్చుతున్నామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, సైబర్ మోసాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడి ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని చెప్పారు. సోషల్ మీడియాకు ప్రజలు బానిసలవుతున్నారని, ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ అన్నారు.
బేసిక్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం...
సాంకేతికత పోలీసింగ్‌కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్‌ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.
వరంగల్‌తో విడదీయరాని అనుబంధం
తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్‌లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ సీవీ ఆనంద్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులో నివాసం ఉన్నానన్న ఆయన నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ప్రతీ రోజు ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వెళ్తామా.. లేదా? అన్న ఆందోళనకర పరిస్థితులు అప్పట్లో ఉండేవన్నారు. ప్రస్తుతం మావోయిజం పూర్తిగా అంతరించిపోవడం సంతోషకరమన్నారు.
ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగు
డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్
వరంగల్‌తో అనుబంధం విడదీయరానిది.. ఐపీఎస్‌గా ఇక్కడి నుంచే ప్రస్థానం
నిట్ మీడియా సమావేశంలో గతాన్ని గుర్తుచేసుకున్న పోలీస్ బాస్
పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి : డీజీపీ


