ఖానాపురం: దివ్యాంగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ఆదివారం దివ్యాంగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క దివ్యాంగుడికి పింఛన్ మంజూరు చేయలేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21,500 మంది దివ్యాంగులు నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు మేరుగు శంకర్, ఉపాధ్యక్షుడు మద్దూరి రవి, ప్రధాన కార్యదర్శి లావుడ్య రామోజీ, సహాయ కార్యదర్శి ధరావత్ భద్రు, కోగంటి ప్రభాకర్‌రావు, రాములు, తదితరులు పాల్గొన్నారు.
నేటి ‘జైల్‌భరో’ను
జయప్రదం చేయండి
సంగెం: కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నేటి (సోమవారం) ‘జైల్‌భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు కోరారు. ఆదివారం సంగెం మండలకేంద్రంలో ఆటో జాత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంటూ కార్మిక రైతు ప్రజా వ్యతిరేఖ విధానాలను అమలు చేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల అనిల్‌కుమార్, ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు గుండేటి స్వామి, సీఐటీయూ మండల కన్వీనర్ దుపాకి రాజు, మండల నాయకులు మెట్టుపల్లి శంకర్, గుండేటి రామృష్ణ, మెట్టుపల్లి బాబు, నీరటీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రామలింగేశ్వరస్వామికి పూజలు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్‌లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రామప్ప సరస్సులో బోటు షికార్ చేసి సరస్సు అందాలను తిలకించారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై నెలకొన్న శ్రీహేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిట లాడింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖ పట్టణం వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముకాకమల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర్‌చంద్ శర్మ, రాజీవ్ శర్మ స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు.


