● నిండని చెరువులు, కుంటలు
● జిల్లాలో 1.95 కోట్ల చేపపిల్లల
పంపిణీ లక్ష్యం
● 17న తెరవనున్న టెండర్లు
గీసుకొండ: జిల్లాలో ఈసారి మత్య్ససంపదకు ‘ఎల్‌నినో’ దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. గతేడాది వర్షాలు మెండుగా కురవడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు, కుంటల్లోకి సరిగా నీరు చేరలేదు. ఈ పరిస్థితి మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతీఏడాది ప్రభుత్వం ఉచితంగా అందించే చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ప్రహసనంలా సాగుతోంది. సరైన సమయంలో చేపపిల్లలను చెరువులోకి వదలక పోవడంతో అవి సరిగా ఎదగడం లేదని మత్స్య సంఘాల వారు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలాఖరు వరకు చేపపిల్లలను వదిలితే బాగుంటుందని, అలా కాకుండా అక్టోబర్ నెల ముగిసే వరకు చేపపిల్లలను పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటున్నారు.
ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ
ఈ ఏడాది చెరువుల్లో చేపపిల్లలను పోయడానికి పలు ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సభ్యులుగా జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), మెంబర్ కన్వీనర్‌గా జిల్లా మత్స్యశాఖ అధికారి వ్యవహరిస్తారు. ఈ కమిటీ దాఖలైన టెండర్లను పరిశీలించి చేపపిల్లలను సరఫరా చేయడానికి అర్హులను గుర్తిస్తుంది. టెండర్లు వేయడానికి గత మూడేళ్ల నుంచి ముందుకు రావడం లేదు. తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం సకాలంలో చెల్లించక పోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది చేపపిల్లలను పంపిణీ చేసే టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో నవంబర్, డిసెంబర్ నెలలో పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు చేపపిల్లలను సరఫరా చేయడానికి ముందుకు వచ్చారు. టెండరు ఖరారు విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో జిల్లాలోని పెద్ద చెరువులకు చేపపిల్లలను సరఫరా చేస్తామని, చిన్న చెరువులకు అందించలేమని వారు చేతులెత్తారు. ఆ ఏడాది జిల్లాలోని 71 పెద్ద (పెరినియల్) చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. మిగతా 635 చిన్న (సీజనల్) చెరువులకు చేపపిల్లలను ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. చేపపిల్లల సరఫరాలో ఈసారి ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
జిల్లాలో 706 చెరువులు
జిల్లాలో 706 చెరువులు ఉండగా వాటిలో సుమారు 71 పెద్ద చెరువులు ఉన్నాయని మత్స్యశాఖ జిల్లా అధికారి పిల్లి శ్రీపతిరావు తెలిపారు. 192 మత్స్య సహకార సంఘాలు ఉండగా వాటిలో 52 మహిళా సంఘాలు, ఒకటి ఎస్సీ, రెండు ఎస్టీ, రెండు మార్కెటింగ్ సంఘాలు ఉన్నాయన్నారు. వీటన్నింటిలో 16,160 మంది సభ్యులు ఉన్నారని, జిల్లాలోని చెరువుల్లో పోయడానికి 1,95,89,000 చేపపిల్లలు అవసరం ఉందన్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 17న టెండర్లను తెరుస్తామన్నారు.


