మంత్రులకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వినతి
కమలాపూర్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు ప్రభుత్వాస్పత్రి స్థలాన్ని కేటాయించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులతో శనివారం జరిగిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పాల్గొని మంత్రులకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా కమలాపూర్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ఆన్ చేసి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీరందించాలని కోరారు. నియోజకవర్గంలో ఇసుక లభ్యత ఉన్నప్పటికీ రూ.1,500కు దొరకాల్సిన ఇసుక రూ.7,500 వరకు విక్రయిస్తున్నారని, పెద్దపల్లి, మానకొండూరు నియోజకవర్గాల మాదిరిగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఇసుక ట్రాక్టర్లకు ఆన్‌లైన్ విధానం లేకుండా తరలింపునకు అనుమతులు కల్పించాలని కోరారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.


