సహకార సంఘాల్లో ప్రభుత్వాల ప్రమేయం ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘాల్లో ప్రభుత్వాల ప్రమేయం ఉండొద్దు

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

న్యాప్స్‌కాబ్‌ చైర్మన్‌

కొండూరి రవీందర్‌రావు

కమలాపూర్‌: సహకార సంఘాలు స్వయం ప్రతిపత్తి సంఘాలని, ఈ సంఘాల్లో ప్రభుత్వాల ప్రమేయం ఉండకూడదని న్యాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అన్నారు. కమలాపూర్‌లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న 0.5 మెగావాట్ల సోలార్‌ పవర్‌ప్లాంట్‌కు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సహకార సంఘాలు రైతుల కోసం పార్టీలకతీతంగా పనిచేసినప్పుడే సంఘాలు బాగుపడుతాయన్నారు. సహకార సంఘాలు రైతుల వాటాధనం, డిపాజిటర్ల వడ్డీతో మాత్రమే నడుస్తున్నాయని, వీటిపై అధికారుల పర్యవేక్షణ మాత్రమే ఉండాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఉమ్మడి కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్న ఈ సోలార్‌ వపర్‌ప్లాంట్‌ ఏడోది అని పేర్కొన్నారు. తెలంగాణలోని సహకార వ్యవస్థకు మంచి పేరు ఉందని, దేశ వ్యాప్తంగా ఏ కొత్త పని చేయాలన్నా ముందుగా కరీంనగర్‌ వెళ్లి చూసి రమ్మని ఆదేశాలు వస్తున్నాయని వివరించారు. పాలకవర్గాల గడువు ముగిసిన సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. డీసీఓ మోహన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంపత్‌రావు, వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌ పబ్బు సతీశ్‌, బండి వనజకళాధర్‌, పీఏసీఎస్‌ సీఈఓ రావుల వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement