విద్యాసంస్థలు భద్రమేనా? | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థలు భద్రమేనా?

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

గ్రేటర్‌ వరంగల్‌లోని కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఫైర్‌ ఎన్‌ఓసీలపై సందేహాలు

సంయుక్త తనిఖీలే పరిష్కారం..

గ్రేటర్‌ వరంగల్‌లోని కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఫైర్‌ ఎన్‌ఓసీలపై సందేహాలు

సాక్షి, వరంగల్‌: హైదరాబాద్‌లో నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలతో 52 జూనియర్‌ కళాశాలలు నడుస్తున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసు కేసులు, ఫైర్‌ ఎన్‌ఓసీల రద్దు వరకు పరి స్థితి వెళ్లింది. ఈ ఘటనతో గ్రేటర్‌ వరంగల్‌ పరిధి లోని పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, ప్రొఫెషనల్‌ కళాశాలల్లో ఫైర్‌ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడి అధికారులు ఇప్పటికైనా మేల్కొని ప్రత్యేక తనిఖీలు చేపట్టకపోతే విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్‌ వరంగల్‌లో ప్రతిరో జూ వేలాది మంది విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్న బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్న విద్యాసంస్థలకు హాజరవుతున్నారు. కానీ, వాటిలో ఎన్ని విద్యాసంస్థలకు చెల్లుబాటు అయ్యే ఫైర్‌ ఎన్‌ఓసీలు ఉన్నాయి? ఎన్ని సంస్థలు ప్రతి ఏడాది రెన్యువల్‌ చేసుకుంటున్నాయి? ఫైర్‌ అలారాలు, స్మోక్‌ డిటెక్టర్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు పనిచేస్తున్నాయా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం సంబంధిత అధికారుల నుంచి రావడం లేదు.

ప్రమాదం జరిగాక..

స్పందిస్తే ప్రయోజనం ఏమిటి?

రాష్ట్రంలో గతంలో పలు అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఘటనల తర్వాతే అధికారులు తనిఖీలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీల వ్యవహారం వెలుగులోకి వచ్చినా వరంగల్‌లో ఇప్పటివరకు సమగ్ర తనిఖీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తు తనిఖీలతో ప్రమాదాలను నివారించడమే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అనేక విద్యాసంస్థల్లో ఉన్న ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు పనిచేసే స్థితిలో ఉన్నాయా? గడువు ముగిసిందా? అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు బయటకు వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా? ఫైర్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారా? వంటి అంశాలపై తరచూ తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి.

అలారాలు, స్మోక్‌ డిటెక్టర్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలపై అనుమానాలు

ప్రమాదం తర్వాత స్పందించడం కంటే అధికారులు ముందే తనిఖీలు చేయాలి

హైదరాబాద్‌లో నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీల వెలుగుతో నగరంలో చర్చ

జిల్లా అగ్నిమాపకశాఖ, విద్యాశాఖ, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సంయుక్తంగా అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫైర్‌ ఎన్‌ఓసీలు మాత్రమే కాకుండా భవన అనుమతులు, ఆక్యుపెన్సీ, అత్యవసర మార్గాలు, విద్యార్థుల సామర్థ్యానికి మించి అడ్మిషన్ల వంటి అంశాలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. కాగా, ఫైర్‌ ఎన్‌ఓసీల సమాచారం కోసం సంబంధిత అధికారులను సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement