ఖానాపురం: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని జూనియర్ కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరికీ నోట్‌బుక్స్, యూనిఫాంలు పంపిణీ చేస్తున్నామన్నారు. కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలన్నారు. రోజువారి అడ్మిషన్‌ల పెంపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు చేరిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,172 మంది ఉన్నారని, మరింత మంది విద్యార్థులు చేరి ప్రభుత్వం అందించే వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


