● హనుమకొండ అదనపు కలెక్టర్ శేషాద్రి
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా పంట కుంటల ఏర్పాటుతో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను హనుమకొండ ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, ఎంపీఓలతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట కుంటలతో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, సాగునీటి లభ్యత మెరుగుపడుతాయని అన్నారు. పంట కుంటల ప్రయోజనాలను రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీఆర్‌డీఓ మేన శ్రీను మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి పంట కుంటలు, ఊర కుంటలు, ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో డీపీఓ ఎల్.రమాకాంత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


