మరో రెండు సర్కిళ్లు ఏర్పాటు చేయాలి..
వరంగల్ అర్బన్: బల్దియా సేవలను నగర ప్రజలకు మరింత చేరువ కావాలని రెండు సర్కిళ్లను 6 సర్కిళ్లుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి తొమ్మిదేళ్లు దాటింది. అయినప్పటికీ పాలకులు, ఉన్నతాధికారులు ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బందితో నాలుగు సర్కిళ్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది. కానీ, ఉన్నతాధికారులు చొరవ తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
నగర శివారులోని 42 గ్రామాలను 2013 మార్చి 19న కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ.. అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో గ్రేటర్ పరిధి 110 చదరపు కిలోమీటర్లు నుంచి 407 కిలోమీటర్లకు విస్తరించింది. జనాభా 9 లక్షలు కాగా.. విలీన గ్రామాలతో 12 లక్షలకు చేరింది. అప్పటి ఉత్తర్వుల ప్రకారం 2014 ఏప్రిల్‌లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 12 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. 2015 జనవరిలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. గ్రేటర్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు 2017 ఫిబ్రవరి 2న అప్పటి బల్దియా పాలకవర్గం కొత్తగా నాలుగు సర్కిల్ కార్యాలయాలు కావాలని కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర పురపాలక శాఖకు ప్రతిపాదనలు పంపించింది. 6 సర్కిళ్లకు అనుమతిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ 267 జీఓ విడుదల చేశారు. దీంతో బల్దియాలో 6 సర్కిల్ కార్యాలయాలకు ప్రాంతాలు, భవనాలు గుర్తించి వదిలేశారు.
రెండు సర్కిళ్లతోనే సరి..
బల్దియాలో సరిపడా అధికారులు, ఉద్యోగులు లేరనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా రెండు సర్కిల్ కార్యాలయాలతోనే కాలం వెళ్లదీన్నారు. ఫర్వాలేదు అన్నట్లుగా అధికారులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేశారు. నలుగురు డిప్యూటీ కమిషనర్లు ఉండగా, కాశిబుగ్గ, కాజీపేట సర్కిళ్లలో ఇద్దరు విధులు నిర్వరిస్తున్నారు. మరో ఇద్దరిలో ఒకరు సెక్రటరీగా, అడ్మిన్‌గా పనిచేస్తున్నారు. ఐదుగురు సూపరింటెండెంట్లు ఉండగా.. మరో మూడు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. 22 మంది సీనియర్ అసిస్టెంట్లు, 30 మంది జూనియర్ అసిస్టెంట్లు, 70 మంది వార్డు ఆఫీసర్లు ఉన్నారు.
6 సర్కిళ్లు కాకపోయినా మరో రెండు సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రజలు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. కాశిబుగ్గ సర్కిల్ పరిధి రంగశాయిపేట లేదా ఉర్సు బల్దియా వార్డు కార్యాలయాల్లో మరో సర్కిల్, అదేవిధంగా కాజీపేట సర్కిల్ పరిధిలో నక్కలగుట్ట లేదా నయీంనగర్ వార్డు కార్యాలయాల్లో మరో సర్కిల్ కార్యాలయం అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిశగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదు. ప్రస్తుతం బల్దియా ప్రధాన కార్యాలయ పాత భవనం శిథిలావస్థకు చేరడంతో చాంబర్లు ఖాళీ చేశారు. మేయర్ భవనంలో కొన్ని బ్లాక్‌లు కేటాయించారు. అవి ఇరుకుగా ఉండడంతో ఇబ్బంది పడుతూ విధులు నిర్వర్తించాల్సి వ స్తోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డు ఆఫీసర్లకు కనీసం కుర్చీలు కూడా ఏ ర్పాటు చేయలేని దుస్థితి ఉంది. ప్రజలు, ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయిస్తే మరో రెండు సర్కిల్ కార్యాలయాలు సిద్ధమవుతాయి. నగర ప్రజల ముంగిటకు పా లన వస్తుంది.
దూపకుంటకు చెందిన దేవేందర్, శాంతమ్మ పనుల కోసం కాశిబుగ్గ సర్కిల్ ఆఫీస్‌కు రావాల్సి వస్తోంది. అందుబాటులో కార్యాలయం లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇలా నగరం, శివారు ప్రాంతాల్లోని ప్రజలు బల్దియా ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి, పట్టింపులేని తనంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముచ్చర్లకు చెందిన చిర్ర సుమన్ బల్దియాకు చెందిన ఏ అనుమతి కోసమైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నాడు. సిటిజన్ చార్టర్ ప్రకారం పరిష్కారం కావడం లేదు. దీంతో కాజీపేట సర్కిల్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. రానూపోను 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఒక్కసారి వెళ్తే పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు వ్యయప్రయాసాలకు గురై కాజీపేటకు వెళ్తున్నాడు.
కలగానే కార్యాలయాల ఏర్పాటు
ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు తప్పని ఇబ్బందులు
సర్కిళ్లు విస్తరించక దూరమవుతున్న సేవలు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు


