వర్షాలు లేక.. నాట్లు పడక | - | Sakshi
Sakshi News home page

వర్షాలు లేక.. నాట్లు పడక

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

ఎల్‌నినో ప్రభావంతో అన్నదాతల్లో ఆందోళన

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం పీజీతండా గ్రామానికి చెందిన నునావత్‌ రమేష్‌. ఇతనికి రెండున్నర ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరంన్నర పొలం, మరో ఎకరం గడ్డ భూమి ఉంది. వర్షాలు కురిసే పరిస్థితి లేదని గడ్డ భూమిలో జొన్నపంట సాగుచేశాడు. కొత్తకుంట చెరువు కింద ఎకరంన్నర పొలం ఉంది. చెరువులోకి ఇంకా నీరు రాలేదు. నారు 45 రోజులు దాటింది. చెరువులోకి చుక్కనీరు రాకపోవడం వల్ల నాటు వేయలేని పరిస్థితి నెలకొంది. మరో వారం రోజుల వరకు చెరువులోకి నీరు రాకుంటే ఇక నాటు వేయడం కష్టమే. ఇలా ఆ చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాలు లేక బీడును తలపిస్తోంది. ఇది ఒక్క రమేష్‌ పరిస్థితి కాదు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరిదీ ఇదే పరిస్థితి.

ముదురుతున్న నారు.. మొదలుకాని సాగు పనులు

జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో బీళ్లుగా మారిన భూములు

ఇంకా చెరువుల్లోకి చేరని వాననీరు

దుగ్గొండి: వానాకాలం సీజన్‌ ఆరంభం అయినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ఎస్సారెస్పీ నీరు రాకపోవడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. కాలం కాకపోయినా కాల్వ నీరు రాకపోతుందా అనే ఆలోచనతో అన్నదాతలు రోహిణి కార్తెలోనే నార్లు పోశారు. అయితే నేటికీ ఆశించిన స్థాయిలో వర్షపాతం లేక నారుపోసి 40 రోజులు దాటుతున్నా నాట్లు వేయలేని దుస్థితి నెలకొంది.

క్రాప్‌ హాలిడే ప్రకటించే యోచనలో..

జిల్లాలోని 11 మండలాల పరిధిలో 2,30,377 ఎకరాల సాగు భూమి ఉండగా, అందులో లక్ష ఎకరాల్లో పత్తి, మిరప, పసుపు, ఇతర ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తుంటారు. 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు మొదట అంచనా వేశారు. అయితే, ఎల్‌నినో ప్రభావంతో సాగు అంచనాను లక్ష ఎకరాలకు కుదించారు. వర్షాలు లేని కారణంగా రైతులు 27 వేల నుంచి 30 వేల ఎకరాలకు మాత్రమే నార్లు పోశారు. వాటిలో బావుల కింద ఇప్పటికి అక్కడక్కడ 2వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. చెరువుల కింద నేటికీ నార్లు పోయలేదు. ఇప్పుడు పోసినా ఫలితం లేదు. నార్లు పోసిన రైతులు నీరు లేకపోవడంతో నష్టపోతున్నారు. దీంతో క్రాప్‌ హాలిడే ప్రకటించే యోచనలో రైతులు ఉండడం కరువు పరిస్థితికి అద్దం పడుతోంది. ఆరుతడి పంటలు పండించాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నా కొన్ని పొలాల్లో ఆరుతడి పంటలు పండే పరిస్థితి లేదు. ఆరుతడి పంటలు వేసి నష్టపోవడం కన్నా పంటలు వేయకుండా ఉండడమే మేలని పలువురు రైతులు భావిస్తున్నారు. దీంతో సాగు భూములు బీళ్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చొరవ చూసి కాళేశ్వరం నీటిని ఎత్తిపోసి మిడ్‌మానేరు నింపి లోయర్‌ మానేరు ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీరు విడుదల చేయాలని కర్షకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement