న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని ఆమె సూచించారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి కౌన్సిల్‌హాల్‌లో అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంద అనిల్
దుగ్గొండి: కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన మంద అనిల్ నియమితులయ్యారు. ఈ మేరకు అనిల్‌కు కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ ఆదివారం నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ కార్యకర్తలకు తోడుగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.
ఖిలా వరంగల్: ఓబీసీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా విశ్వనాథ కాలనీకి చెందిన కర్నె రవీందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఓబీసీ బలోపేతానికి కృషి చేస్తానని రవీందర్ పేర్కొన్నారు.
ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా
రమేష్ యాదవ్
నల్లబెల్లి: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా మండలంలోని నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన వల్లె రమేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కూచన క్రాంతి కుమార్ ఆదివారం నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు కూచన క్రాంతికుమార్, నియోజకవర్గ నాయకుడు కంభంపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో కృషి చేస్తానని రమేష్ పేర్కొన్నారు.
సంగెం: ఎల్‌నిలో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి ఎద్దడితో అల్లాడుతున్న అన్నదాతకు దేవాదుల ఎత్తిపోతల నీరు ఉపశమనం కలిగించింది. స్టేషన్ ఘన్‌పూర్ మండలం నుంచి దేవాదుల ఎత్తిపోతల నీరు డీ–8 ద్వారా సంగెం మండలంలోని గవిచర్లకు గోదావరి జలాలు ఆదివారం చేరాయి. సర్పంచ్ బాషిపాక సదయ్య శ్రమించి ఐనవోలు మండలం సింగారం నుంచి గ్రామానికి చేరుకునేలా చొరవ తీసుకున్నారు. కాల్వ ద్వారా వచ్చిన నీటిని రాయకుంటలోకి అనంతరం ఊర చెరువు నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాల్వలోని గోదావరి నీటిని సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ గుమ్మడి సంపత్, నాయకులు గోలి రవి, గుళ్లపల్లి తిరుపతి, రావుల చిన్న రామకృష్ణ, మహబుబ్‌పాషా తదితరులు పరిశీలించారు.


