హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శనివారం ఉదయం అమ్మవారిని ఏకాదశి తిథికి ఆది దేవతయైన ఘనా, నీల పతాకా క్రమంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో నిత్యాహ్నిక పూజలు, చతుస్థానార్చనలు జరిపారు. స్నపన మూర్తిని కాళీకల్పకం ప్రకారం ఘనాదేవిగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో నీల పతాక మాతగా అలంకరించి చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ విజయసేనా రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో వరంగల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నర్సంపేట: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో ఖాళీగా ఉన్న ఒక్క అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లం నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో ఆయన మాట్లాడారు. దరఖాస్తు చేసేందుకు పీజీలో ఓసీ, బీసీలకు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్, సెట్, స్లెట్ వంటి అదనపు అర్హతలు, బోధనానుభవం కలిగిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, ధ్రువపత్రాలను జతపరిచిన దరఖాస్తులను కళాశాలలో ఈనెల 28వ తేదీ సాయంత్రం 4గంటల వరకు సమర్పించాలని సూచించారు. గతంలో దరఖాస్తులు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలి
వరంగల్ అర్బన్: ప్రజాఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకూడదని బల్దియా అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనా ఆదేశించారు. శనివారం కార్యాలయంలోని తన చాంబర్‌లో వివిధ విభాగాల పర్యవేక్షకులు, సెక్షన్ హెడ్‌లు, న్యాయాధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులు, ఆర్టీఐ దరఖాస్తులు, కోర్టు కేసులు, ఇతర పెండింగ్ ఫైళ్ల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో బల్దియా న్యాయాధికారి శ్రీనివాస్, పర్యవేక్షకులు సంతోశ్, ఆనంద్‌కుమార్, దేవేందర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
వరంగల్ అర్బన్: అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తడి, పొడి చెత్త సేకరణ కోసం మోడల్ డివిజన్‌గా ఎంపిక చేసిన 26లోని చార్‌బౌళి, గిర్మాజీపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, స్వచ్ఛ ఆటోలు సమయపాలన తదితర విషయాలను స్థానిక గృహాల యాజమానుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సంపేట గ్రాండ్ ఎంట్రెన్స్, ఖమ్మం గ్రాండ్ ఎంట్రెన్స్ ప్రాంతాలను పరిశీలించారు. ఎంజీఎం ఎదురుగా స్వీపింగ్ మిషన్‌తో చేపడుతున్న రహదారి శుభ్రత పనుల్ని పరిశీలించారు. అనంతరం సర్‌పై ఆరా తీశారు.


