మార్కెట్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ సత్యశారద
వరంగల్: మిర్చి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌కు వచ్చే రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మార్కెట్‌ను ఆమె శుక్రవారం సందర్శించి మిర్చి యార్డులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో నేరుగా మాట్లాడుతూ 49 కిలోల లోపు మిర్చి బస్తాలను మాత్రమే తీసుకురావాలని సూచించారు. 49 కిలోల కంటే ఎక్కువ ఉంటే కాయలో నాణ్యత తగ్గే అవకాశం ఉన్నందున ధరల్లో వ్యత్యాసం ఏర్పడుతుందని చెప్పారు. ఈ విషయమై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటూ మార్కెట్‌లో కరపత్రాలతో పాటు ఇతర మాధ్యమాల్లో అవగాహన కల్పించాలని మార్కెట్ కార్యదర్శికి సూచించారు. రైతులకు ఇతర మార్కెట్లలో ధరలు తెలిసే విధంగా డిస్‌ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళా రైతుల కోసం ఏనుమాముల మిర్చి యార్డులో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ధాన్యం – అపరాల యార్డులో కమీషన్ వ్యాపారస్తుల కోసం నిర్మిస్తున్న షాపుల నిర్మాణ పనులు, ఏనుమాముల మార్కెట్‌లో చైల్డ్ లేబర్ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో డీఎంఓ కె.సురేఖ, ఉన్నతశ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేషం, గ్రేడ్ –2 కార్యదర్శులు ఎస్.రాము, జి.అంజిత్‌రావు, తహసీల్దార్ శ్రీకాంత్, చాంబర్ ప్రతినిధులు సాగర్ల శ్రీనివాస్, అల్లె సంపత్, లింగారెడ్డి, రాజేష్ డి కరాణి, వెల్ది సాంబయ్య పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇన్నర్ రింగ్‌రోడ్డుకు భూసేకరణ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ఫేస్–1లో పూర్తైన పనుల పురోగతిని పరిశీలించి ఫేస్ –2లో రోడ్ల నిర్మాణానికి భూ సేకరణను త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన బాలల పరిరక్షణ సభ్యులు
వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, గోగుల సరిత, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వసుధ, సభ్యులు సుజాత, రామలీల, డీవీపీఓ ఉమ, తదితరులు పాల్గొన్నారు.
ఓరుగల్లు కన్సల్టెన్సీ అసోసియేషన్
లోగో ఆవిష్కరణ
హనుమకొండ, వరంగల్ జంట నగరాల్లో అబ్రాడ్ కన్సల్టెన్సీ రంగానికి చెందిన నిర్వాహకులు ఓరుగల్లు కన్సల్టెన్సీ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ మేరకు అసోసియేషన్ లోగోను వరంగల్ కలెక్టర్ సత్యశారద చేతుల మీదుగా కలెక్టరేట్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. విదేశీ విద్య, ఇమిగ్రేషన్ సేవలను మరింత పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఈ సంఘం స్థాపించినట్లు బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడెపు మధుసూదన్, మనోజ్, నితీష్, శివ, వినయ్, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.


