బోజెర్వు గుట్టలో క్రషర్‌ ! | - | Sakshi
Sakshi News home page

బోజెర్వు గుట్టలో క్రషర్‌ !

Feb 28 2026 7:03 AM | Updated on Feb 28 2026 7:03 AM

బోజెర

బోజెర్వు గుట్టలో క్రషర్‌ !

చెన్నారావుపేట: మండలంలోని బోజెర్వు గుట్టపై క్రషర్‌ ఏర్పాటు చేయవద్దని ప్రజలు పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వం టెండరు ప్రక్రియ చేపట్టడంతో పంట పొలాలు దెబ్బతింటాయని, జీవనోపాధికి విఘాతం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు వ్యతిరేకించడంతో గత ప్రభుత్వాలు రెండుసార్లు మైనింగ్‌ ఆలోచనను విరమించుకున్నాయి. ప్రస్తుతం మళ్లీ క్రషర్‌ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మండల పరిధిలోని బోజెర్వు సర్వే నంబర్‌ 133/1లో సుమారు 50 ఎకరాల్లో రాతిగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్ట మీద సుమారు 11 ఎకరాల్లో మైనింగ్‌కు అనుమతి ఇవ్వొచ్చంటూ రెవెన్యూ శాఖ ఇటీవల నోఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) ఇచ్చింది. దీంతో గుట్ట మీద 11 ఎకరాల్లో మైనింగ్‌ చేసి కంకర విక్రయించడానికి క్రషర్‌ ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వ్యాపారుల నుంచి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మార్చి 2వ తేదీ వరకు గడువు ఉండగా శుక్రవారం వరకు ఐదు టెండర్లు దాఖలైనట్లు అధికారుల ద్వారా తెలిసింది.

రైతుల ఆందోళనతో రెండుసార్లు ఎన్‌ఓసీ రద్దు

బోజెర్వు గుట్టకు మైనింగ్‌ చేయడానికి గతంలో రెండుసార్లు రెవెన్యూ శాఖ ఎన్‌ఓసీ ఇచ్చింది. ఓ కాంట్రాక్టర్‌ క్రషర్‌ ఏర్పాటుకు ముందుకు రాగా.. పంట పొలాలు నాశనం కావడమే కాకుండా గ్రామంలోని నాలుగు వేల గొర్రెలకు మేత కరువయ్యే ప్రమాదం ఉందంటూ రైతులు, గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి ఆందోళనలు చేపట్టారు. దీంతో తొలుత 2013లో నాటి ప్రభుత్వం క్రషర్‌ ఏర్పాటుపై ఎన్‌ఓసీ రద్దు చేసింది. అనంతరం 2021లో మళ్లీ క్రషర్‌ ఏర్పాటుకు టెండరు ప్రక్రియ చేపట్టగా ఓ కాంట్రాక్టర్‌ దరఖాస్తు చేశాడు. తహసీల్దార్‌ ఎన్‌ఓసీ ఇచ్చినా గ్రామసభలో ప్రజలు వ్యతిరేకించడంతో నాటి ప్రభుత్వం రద్దు చేసింది.

క్రషర్‌ ఏర్పాటు చేస్తే భారీ నష్టం

బోజెర్వు గుట్టపై క్రషర్‌ ఏర్పాటు చేస్తే తమకు భారీ నష్టం తప్పదని గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్‌ నుంచి వచ్చే దుమ్మూధూళికి పంట పొలాలు దెబ్బతింటాయని, వాపోతున్నారు. బాంబుల మోతతో వ్యవసాయ బావులు పూర్తిగా ధ్వంసమవుతాయని పేర్కొంటున్నారు. వాయుకాలుష్యం ఏర్పడి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.

వేంకటేశ్వరస్వామి ఆలయానికి ముప్పు..

క్రషర్‌ ఏర్పాటు చేస్తే గుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ధ్వంసం ఖాయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి ముప్పు ఉందన్న వాదనలు వినవస్తున్నాయి. ఆలయ పరిరక్షణ కోసం సైతం వెంటనే మైనింగ్‌ ఎన్‌ఓసీ రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఎన్‌ఓసీ రద్దు చేయాలని వినతి..

బోజెర్వు గుట్టపై క్రషర్‌ ఏర్పాటు చేయకుండా ఎన్‌ఓసీ రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఇటీవల కలెక్టర్‌ కార్యాలయంలో డీఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. అలాగే, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.

బోజెర్వు గ్రామంలోని గుట్ట

టెండర్‌ పిలిచిన అధికారులు

మైనింగ్‌కు 11 ఎకరాల భూమి కేటాయింపు

పొలాలు దెబ్బతింటాయని రైతుల ఆందోళన

ఎన్‌ఓసీ రద్దు చేయాలని డీఆర్వో, ఎమ్మెల్యేకు వినతి

బోజెర్వు గుట్టలో క్రషర్‌ !1
1/1

బోజెర్వు గుట్టలో క్రషర్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement