వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయంలో ముక్కోటి దేవతలను ఆహ్వానించి, భేరీ పూజ తర్వాత స్వామి వారిని అశ్వవాహనంపై గుట్టకిందికి తోడ్కొని వెవెళ్లారు. అనంతరం స్వామివారిని గుట్టచుట్టూ తిప్పారు. అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిని పల్లకీలో గుట్టపై నుంచి కిందికి తోడ్కొని వెవెళ్లి గుట్ట దిగువన ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి కల్యాణాన్ని అమ్మవార్లతో వేదపండితులు వైభవంగా నిర్వహించారు. గతం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం కొమ్మాల గ్రామంలోని కొమ్మిడి వంశస్తులు పట్టువస్త్రాలు, తలంబ్రాలను తమ ఇంటి నుంచి సర్పంచ్ కన్నెబోయిన యమున ఇంటికి, సర్పంచ్ తన ఇంటి నుంచి కల్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించి దేవతామూర్తులకు పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్, అర్చకులు రామాచార్యులు, విష్ణు, ఫణి, పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రేవూరి
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం


