ఎంజీఎంలో రక్తం కొరత !
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఓపీ చిట్టీ నుంచి మొదలుకుని చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతీ విభాగంలో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందే రోగులు మెరుగైన వైద్యసేవలు పొందడానికి రక్తనిధి కేంద్రం సేవలు అత్యంత కీలకం. కానీ, ఈ కేంద్రం సేవల సమస్యలను పరిష్కరించడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో 1,500 పడకలతోపాటు సీకేఎం, జీఎంహెచ్, ఆర్‌ఈహెచ్, టీబీ ఆస్పత్రులతోపాటు చుట్ట పక్కల ప్రభుత్వ ఆస్పత్రులకు పెద్ద దిక్కుగా ఈ బ్లడ్‌బ్యాంకు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బ్లడ్‌బ్యాంకులో 300 యూనిట్ల కంటే ఎక్కువగా రక్తం నిల్వ లేదనే విషయాన్ని గమనిస్తే దీని నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది.
విధుల్లో వైద్యాధికారి..
ఎంజీఎం ఆస్పత్రి వంటి అతి పెద్ద రక్తనిధి కేంద్రానికి సిబ్బంది కొరత పెద్ద తలనొప్పిగా మారింది క్యాంపుల నిర్వహణ కోసం కౌన్సిలర్లు లేకుండా ఈ రక్తనిధి కేంద్రం కొనసాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నాయకుల జన్మదినం, మానవతా దృక్పథంతో వచ్చే రక్తదాతల సహకారం తప్ప గత కొన్ని నెలలుగా ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం లేదు. గతంలో మోటిటేటర్‌గా పనిచేసి అత్యత్తుమ అవార్డులు సాధించిన కల్యాణి అనే ఉద్యోగిని పరిపాలనాధికారులు అకారణంగా తొలగించారు. కొన్ని నెలల క్రితం డిప్యుటేషన్‌పై వచ్చిన కౌన్సిలర్‌ను సైతం వెనక్కి పంపించేశారు. బ్లడ్‌బ్యాంకులో ముగ్గురు వైద్యాధికారులు, 12 మంది ల్యాబ్‌టెక్నీషియన్లు, నలుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, మోటివేటర్, కౌన్సిలర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం ఒకే ఒక్క వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రమే కొనసాగుతున్నారు.
బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కౌన్సిల్ నిబంధనలు..
రాష్ట్రంలో వైద్యసేవలను మరింత బలోపేతం చేసేందుకు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కౌన్సిల్ సెప్టెంబర్ మాసంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
● ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రాల్లో రక్తం కొరత లేకుండా చూడాలి.
● ప్రైవేట్, స్వచ్ఛంద రక్తసేకరణ కేంద్రాలు తాము సేకరించే రక్త యూనిట్లలో 30 శాతాన్ని జిల్లాలోని ప్రభు త్వ రక్తనిధి కేంద్రాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది.
● ఈ ప్రక్రియపై ప్రతి నెల నివేదికలను తెలంగాణ రాష్ట్ర రక్త మార్పిడి మండలికి పంపించాల్సి ఉంటుంది.
● ఈ నివేదిక ప్రకారం ఎంజీఎం బ్లడ్‌బ్యాంకుకు రావాల్సి న రక్తం యూనిట్ల రాకపోవడం వల్ల పేద ప్రజలకు రక్తం కొరత ఏర్పడుతోంది.
● ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలని, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కౌన్సిల్ నిర్ణయాలను ఉల్లంఘిస్తున్న కేంద్రాలపై కొరడా ఝుళిపించాలని పేద ప్రజలకు వేడుకుంటున్నారు.
● ఈ విషయమై సూపరింటెంటెండ్ డాక్టర్ హరీశ్‌చంద్రారెడ్డిని వివరణ కోరగా సిబ్బందిని నియమించి, రక్తం కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు.
రక్తనిధి కేంద్రంలో నియామకానికి నోచుకోని కౌన్సిలర్లు.. కానరాని క్యాంపులు
కౌన్సిల్ నిబంధనలు పట్టించుకోని
ప్రైవేట్ బ్లడ్‌బ్యాంకులు
రక్తం కోసం పరుగులు తీస్తున్న
పేద రోగులు
ఏటూరునాగారంనుంచి ఇటీవల ఓ కేన్సర్ పేషెంట్ చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చాడు. రక్తం కావాలని సదరు పేషంట్ కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. వారు బ్లడ్‌బ్యాంకుకు వెళ్తే సిబ్బంది ఒక యూనిట్ మాత్రమే ఇచ్చారు. ఇంకో యూనిట్ కావాలంటే లేదు అని చెప్పారు. దీంతో వారు ప్రైవేట్ బ్లడ్‌బ్యాంకు వెళ్లి రక్తం ప్యాకెట్ కొనుక్కొని వచ్చారు. ఈ పరిస్థితి ఒక్క కేన్సర్ పేషంట్‌ది మాత్రమే కాదు.. ఎంజీఎం ఆస్పత్రిలో అనేకమంది రోగులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.


