నాగసుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు
గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలిలోని ప్రసిద్ధ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భవమ నవమిని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకులు శ్రీహర్ష పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
16 నుంచి అంతర్గత మార్కుల పరిశీలన
డీఈఓ రంగయ్య నాయుడు
కాళోజీ సెంటర్: జిల్లాలో పదో తరగతి విద్యార్థుల అంతర్గత (ఇంటర్నల్) మార్కుల పరిశీలన ప్రక్రియ ఈనెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మార్కుల విభజన పదో తరగతిలో ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కులు వార్షిక పరీక్షకు కేటాయించగా 20 మార్కులు అంతర్గత మూల్యాంకనానికి కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో 290 పాఠశాలల నుంచి 9,492 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. ఇందులో ప్రభుత్వ జిల్లా పరిషత్, వెల్ఫేర్, మోడల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 5,278 మంది కాగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 4,214 మంది ఉన్నారు. తనిఖీ కోసం 48 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతీ బృందంలో ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించిన ఎఫ్‌ఏ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. తనిఖీ చేసిన వివరాలను వెంటనే సంబంధిత వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని డీఈఓ తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: జిల్లాలోని మోడల్ స్కూల్స్‌లో 2026–27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో కొత్త అడ్మిషన్స్‌తో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4న ఉంటుందన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలకు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. టీజీఎంఎస్.తెలంగాణ.జీఓవీ.ఇన్‌ను సంప్రదించాలన్నారు.
రేపు కొమ్మాల జాతరలో బహిరంగ వేలం
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా పలు పనులు, సేవలు అందించడానికి సీల్డ్ టెండర్/బహిరంగ వేలం పాటలను ఈ నెల 12న (గురువారం) ఆలయం వద్ద నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పి.ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకోవడానికి రూ.లక్ష, కొబ్బరి ముక్కలు, చిప్పలు పోగు చేసుకోవడానికి రూ.50 వేలు, తలనీలాలు సేకరించడానికి రూ.20 వేలు, పుట్నాలు, పేలాలు అమ్ముకోవడానికి రూ. 20 వేలను డిపాజిట్‌గా చెల్లించి ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో ఆసక్తిగల వారు టెండర్లు దాఖలు చేయవచ్చన్నారు. అదే రోజు మధ్నాహ్నం 12 గంటల తర్వాత వేలం పాటలను నిర్వహిస్తామన్నారు. టెండర్ల కాల పరిమితి ఈ నెల 23 నుంచి మార్చి 27వ తేదీ వరకు ఉంటుందన్నారు.
‘స్కిల్‌డిజైర్’తో కేయూ ఎంఓయూ
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని స్కిల్‌డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో మంగళవారం కేయూ ఎంఓయూ కుదుర్చుకుంది. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి సమక్షంలో అవగాహన పత్రాలను రిజిస్ట్రార్ వి.రామచంద్రం, స్కిల్‌డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ మార్చుకున్నారు. ఈ ఒప్పందం ఒక సంవత్సర కాలం ఉంటుంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరగుపర్చడం కోసం ఎంఓయూ ఉద్దేశమని రిజిస్ట్రార్ తెలిపారు.


