వర్ధన్నపేట అభివృద్ధికి కృషి
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంఎంఆర్ ఫంక్షన్ హాలులో కలెక్టర్ సత్యశారదతో కలిసి ఇందిర మహిళ శక్తి చీరలు, మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వర్ధన్నపేటలో వంద పడకల ఆస్పత్రి, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, సబ్ జైలు, మున్సిఫ్ కోర్టు, ఆర్డీఓ కార్యాలయంతో పాటు పట్టణ అభివృద్ధికి రూ. 15 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనుల చేపడుతున్నామన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం మహిళలకు గౌరవం, ఆత్మవిశ్వాసం కల్పించే లక్ష్యంగా రూపుదిద్దుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుధీర్‌కుమార్, మెప్మా డీఎంసీ వహీదా, ఆరెల్లి లక్ష్మి, నిమ్మాని శేఖర్‌రావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కాగా వంద పడకల ఆస్పత్రి నిర్మాణం వేరేచోటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే వర్ధన్నపేటలోనే వంద పడకల ఆస్పత్రి నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


