
పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం
ఐనవోలు: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తల బృందం మండలంలోని పలు గ్రామాల్లో వివిధ పంటలు, కూరగాయల సాగు క్షేత్రాలను శనివారం సందర్శించింది. ఈసందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త ఎ.విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు వేప నూనె (1,500 పీపీఎం) ఎకరాకు లీటరు చొప్పున, ఎకరాకు 300 గ్రాముల అసిఫేట్ పిచికారీ చేయాలని సూచించారు. మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటల్లో పిచికారీ చేసుకోవాల్సిన మందుల గురించి వివరించారు. వరినాట్లు ఆలస్యంగా జరుగుతున్నందున కలుపు యాజమాన్యంపై జాగ్రత్త వహించాలన్నారు. కూరగాయల పంటలైన టమాట, వంగ తోటల్లో ప్రస్తుతం చేయాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. రైతులు లింగాకర్షణ బుట్టలు పెట్టుకుని రెక్కల పురుగులను అదుపు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ విశ్వతేజ, మండల వ్యవసాయ అధికారి సునీల్‌కుమార్, ఏఈఓలు అనూష, సువర్ణ, హీనా కౌసర్, ప్రసన్న లక్ష్మి, అఫ్రీన్‌తో పాటు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.