
నర్సంపేట సబ్‌జైలర్ సస్పెన్షన్
నర్సంపేట రూరల్: నర్సంపేట సబ్‌జైలర్ (సూపరింటెండెంట్) లక్ష్మీశృతిని సస్పెండ్ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా జైలర్ పరావస్తు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని మహిళా సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ పెండ్యాల సుచరిత అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా లక్ష్మీశృతి నిర్లక్ష్యం చేసింది. దీంతో సుచరిత మృతి చెందింది. ఆమె మృతికి విధుల్లో నిర్లక్ష్యమే కారణమంటూ ప్రాథమిక విచారణలో తేలడంతో లక్ష్మీశృతిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జైలర్ స్రవంతికి నర్సంపేట ఇన్‌చార్జ్ సబ్ జైలర్‌గా బాధ్యతలు అప్పగించారని, ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు.
ట్రాక్టర్ కిందపడి
వృద్ధురాలి మృతి
నర్సంపేట: ట్రాక్టర్ కింద పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండలం అక్కల్‌చెడ గ్రామ శివారు కట్టయ్యపల్లెలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కట్టయ్యపల్లెకు చెందిన మంకు శశిరేఖ (60) నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి ఎదుట శనివారం ట్రాక్టర్ సాయంతో మొరం పోయిస్తోంది. అక్కల్‌చెడ గ్రామానికి చెందిన పడిదం ప్రదీప్ ట్రాక్టర్‌ను అతి వేగంగా రివర్స్ తీస్తూ వెనుక ఉన్న శశిరేఖను ఢీకొట్టాడు. దీంతో ఇంజన్ వెనుక ఉన్న టైర్ కింద ఆమె పడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు ప్రదీప్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.
వివాహిత అదృశ్యం
గీసుకొండ: వివాహిత అదృశ్యమైన ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రెకుంటకు చెందిన మౌనికకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాల గ్రామానికి చెందిన కలకోటి సురేశ్‌తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేశ్ ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి ఒంగోలులో కిరాయి ఇంటిలో ఉంటున్నాడు. ఇంటి యజమాని వారు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయమని చెప్పడంతో భార్య, పిల్లలను తీసుకుని గొర్రెకుంటలోని మౌనిక తల్లిగారింటికి ఈ నెల 20 వచ్చాడు. ఇల్లు దొరికిన తర్వాత భార్య, పిల్లలను తీసుకుని వెళ్తానని చెప్పి అతడు వెళ్లిపోయాడు. ఈ నెల 21న మధ్నాహ్నం సుమారు 2 గంటల సమయంలో మౌనిక ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. మౌనిక అక్క రేవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు.
ప్రశాంతంగా నవరాత్రి
ఉత్సవాలు జరుపుకోవాలి
వర్ధన్నపేట: గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. వర్ధన్నపేటలో శనివారం శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు.
యువకుడి రిమాండ్
నెక్కొండ: నేరారోపణలు ఎదుర్కొన్న మండల కేంద్రానికి చెందిన ఈదునూరి విష్ణువర్ధన్ (బబ్లూ)పై శనివారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో గంజాయి రవాణా చేస్తుండగా బబ్లూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. అలాగే, 2024లో ఓ వ్యక్తిని కొట్టిన ఘటనలో అతడిపై కేసు నమోదైంది. ఈ నెల 20న నెక్కొండ తెలంగాణ తల్లి సెంటర్‌లో అకారణంగా ఓ వ్యక్తిపై గొడవపడి దాడి చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. అంతేకాకుండా మండల కేంద్రానికి వచ్చిపోయే వారిని ఇబ్బందులు పెడుతూ గొడవ పడుతుంటాడని ఆయన చెలిపారు. దీంతో అతడిపై పలు కేసులున్న కారణంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.

నర్సంపేట సబ్‌జైలర్ సస్పెన్షన్