
న్యాయం కోసం వివాహిత పోరాటం
● అత్తింటివారు ఇంటిలోకి
రానివ్వడం లేదని ఆందోళన
నర్సంపేట: న్యాయం కోసం వివాహిత పోరాటం చేస్తున్న సంఘటన చెన్నారావుపేట మండలం గురిజాల గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరి–యుగేంధర్‌రెడ్డి దంపతుల కూతురు రజితను.. గురిజాల గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి కుమారుడు రవికుమార్‌కు సుమారు రూ.50 లక్షల వరకట్నం వచ్చి వివాహం జరిపించారు. వీరికి రెండున్నర సంవత్సరాల పాప ఉంది. కొద్ది రోజులుగా గొడవలు జరుగుతుండడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. రజిత–రవికుమార్ కలిసి ఉండాలని పెద్దమనుషులు చెప్పి పంపించారు. మళ్లీ కొద్ది రోజులుగా తన భర్త రవికుమార్ ఆయన సోదరి చెప్పే మాటలు విని ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయింది. కట్నం కింద ఇచ్చిన రూ.50 లక్షలతో తన పేరు మీద ఇల్లు కొనుగోలు చేయాలని అడిగితే రవికుమార్ తన తల్లిదండ్రుల పేరుతో కొనుగోలు చేశాడని తెలిపింది. కూతురు, తల్లితో కలిసి అత్తగారి ఇంటికి శుక్రవారం సాయంత్రం రాగా అత్తమామ తనను ఇంటిలోకి రానివ్వకుండా గేటు వేశారని, శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జామువరకు ఇంటి ఎదుటే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికైనా గ్రామస్తులు, పోలీసులు, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రజిత వేడుకుంటోంది.