
తార స్థాయికి లారీఓనర్స్ అసోసియేషన్ గొడవ
● కొండా, రేవూరి వర్గాలుగా ఏర్పడి ఫైట్
గీసుకొండ: గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతంలోని ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో వివాదాలు తార స్థాయికి చేరాయి. అసోసియేషన్ ఒకటైనా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేరు చెప్పి ఓ వర్గం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరు చెప్పి మరో వర్గం గొడవలకు దిగుతున్నాయి. ఫిరోజ్‌అలీ, షేక్ అజ్మల్ (రేవూరి వర్గం) కొంత కాలంగా అసోసియేషన్‌కు సంబంధించి లారీ ఓనర్లు, కార్మికులకు చెందిన రూ.32 లక్షలు కాజేశారని, బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.10 లక్షల లెక్కలు చూపించడం లేదని కొండా వర్గంగా చెప్పుకుంటున్న ఎండీ షకీల్ అహ్మద్, వేముల శ్రీకాంత్, ఇజగిరి శంకర్ ఆరోపిస్తున్నారు.
లోడింగ్ ఆపవద్దని చెప్పినా వినకుండా..
కొందరు లారీల లోడింగ్‌ను అడ్డుకోవడంతో కలెక్టర్ సత్యశారద మూడు రోజుల క్రితం ఇరువర్గాలను పిలిచి లోడింగ్ ఆపవద్దని, ఎవరూ అడ్డుకోవద్దని చెప్పినా వినకుండా అడ్డుకుంటున్నారని రేవూరి వర్గం వారు వాపోతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తమ లారీకి లోడింగ్ లేకపోవడంతో లారీ యజమాని సయ్యద్ ఇస్మాయిల్ .. వైరి వర్గం నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్కూటీపై వెళ్తుండగా కోటగండి వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్ కుమారుడు ఫిరోజ్‌ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు.
ఆస్పత్రి ఎదుట ఆందోళన..
విషయం తెలుసుకున్న రేవూరి వర్గం లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గాయపడ్డ సయ్యద్ ఇస్మాయిల్ భార్య అబేగా ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ తన భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
వైరల్ అవుతున్న ఆడియో
ఈ గొడవ ఇలా జరుగుతుండగా కొండా మురళి అనుచరుడు గోపాల నవీన్‌రాజు.. రేవూరి వర్గానికి చెందిన ఫిరోజ్ అలీని బెదిరిస్తూ మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతోంది. వెంటనే అసోసియేషన్‌కు వచ్చే డబ్బులు చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటావని అతడిని బెదిరించినట్లు వాట్సాప్‌లో ఆడియో చక్కర్లు కొడుతోంది.