
డీటీఓ కార్యాలయాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్:
రవాణాశాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. అన్ని పనులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు రూ.లక్షలకు పడగలెత్తుతుండగా.. అధికారుల ఆదాయం, అక్రమాస్తులకు హద్దూపద్దు లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో వెల్లడవుతున్న ఆస్తుల వివరాలే ఇందుకు సాక్ష్యం. మే 7న ఏకంగా వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ.. ఆ తర్వాత ఈ జిల్లాలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగిత్యాల డీటీఓ భద్రునాయక్ రూ.22 వేలు తీసుకుంటుండగా ఆగస్టు 6న పట్టుకున్నారు. తాజాగా వరంగల్, హనుమకొండలో ఎంవీఐగా పనిచేసిన జి.వివేకానంద రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం రవాణాశాఖలో కలకలం రేపుతోంది. నెల రోజుల కిందట వివిధ పనుల కోసం ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. కొందరు సీనియర్ ఎంవీఐల ఆస్తులపై ఆరా తీస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంతులేని ఆదాయం..
పోస్టింగ్ కోసం పోటాపోటీ
రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడి పోస్టింగ్‌లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్‌స్పెకర్లు ఇప్పుడు ఇన్‌చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్‌లు తిరకాసు చేసి జూనియర్‌లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్‌గా ఉన్న 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండడం ఇష్టం లేక అతనే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యాచ్‌కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మామూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే ఇన్‌చార్జ్‌ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది. వరంగల్‌లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్‌చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికారి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్‌చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్‌ఛార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్‌లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధికారుల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ పో స్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. అక్రమ సంపాదనే లక్ష్యంగా కొత్త పద్ధతులు పెడుతూ అర్జాదారులనుంచి అడ్డగోలుగా వసూలు చేస్తూ చివరికి ఏసీబీకి చిక్కుతున్నారంటూ ఆ శాఖ ఉ ద్యోగులే చర్చించుకోవడం గమనార్హం. రవాణా శాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవి నీతి నిరోధకశాఖ అధికారులు కూడా ద్వంద్వ వైఖ రితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. వ్యక్తిగత పరి చయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు, అధికారులపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హనుమకొండ డీటీఓలో రెండింతలు పెరిగిన వసూళ్లు..
హనుమకొండ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వివిధ పనుల కోసం లంచాలు వసూలు చేస్తున్నారని, ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం వచ్చిన ఓ సీనియర్ ఎంవీఐ.. ఈ కార్యాలయానికి లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ కోసం వచ్చే వాళ్లనుంచి చేసే వసూళ్లు రెండింతలు చేశారన్న ఫిర్యాదులు కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లాయి. లెర్నింగ్ లైసెన్స్‌కు ఏడాది కిందట రూ.500 వరకు తీసుకుంటే ప్రస్తుతం రూ.1,000కి పెంచారని, రూ.700–800లు ఉన్న లైసెన్స్ మామూళ్లు రూ.2,000లకు పెరిగిందని బాధితులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసుకొని వచ్చిన అర్జీదారుడికి అసలు కంటే కొసరే ఎక్కువగా భారమవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అసలు సొమ్మును కట్టినా తనిఖీ అధికారులు కొసరుగా వేరే రేట్లను ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో ఒక్కో వాహనానికి రూ.2200 ఉంటే దానిని ఏకంగా రూ.5500 పెంచినట్లు ఆరోపణలున్నాయి. ఇలాగే ఇటీవల జూన్ మాసంలో స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ ధరలు ఒక్కోబస్సుకు రూ.4,500ల వరకు వసూలు చేయడం వివాదాస్పదమైంది. కాగా ముఖ్యంగా వాహన ఫిట్‌నెస్‌లు, లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సుల పైళ్లపైనే కోడ్‌లు ఉండడం బహిరంగ రహస్యం. కోడ్‌లేని ఫైళ్లను.. చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపుతూ కొర్రీలు పెడుతూ ఫిట్‌నెస్ అపడం.. వాహనదారుడు దానికి వేరే రేటు ఇచ్చుకుంటే పూర్తి చేయడం ద్వారా రూ.వేలు చేతులు మారుతున్నాయి.
ఏసీబీ దాడులకు వెరవని రవాణాశాఖ అధికారులు
వసూళ్లకు ‘ప్రైవేట్’ వ్యక్తులు, ఏజెంట్లే మధ్యవర్తులు
కాసుల కక్కుర్తితో అడ్డంగా దొరికిపోతున్న అధికారులు
ఆదాయాన్ని మించిన ఆస్తులు..
ఆ ఫిర్యాదులపైనే పలువురిపై దాడులు
ప్రతి పనికీ రేటు.. ఇటీవలే రెండింతలు
హనుమకొండ డీటీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు