
మాజీ కౌన్సిలర్ సహా కుమారుడిపై దాడి
● భార్య అడ్డుకోవడంతో
ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు
● పోలీసులను ఆశ్రయించిన ఇరువర్గాలు
పరకాల: పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అల్లె దశరథంతోపాటు అతడి కుమారుడు ప్రశాంత్‌పై నడిరోడ్డుపై దాడి చేశారు. ఈ ఘటన పరకాలలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం ఈ వీడియో వైరలైంది. రెండు నెలల్లో రెండుసార్లు అల్లె దశరథంపై దాడి జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. పాత గొడవల కారణంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. దశరథం ఇటీవల అంబాల రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా కొందరు వ్యక్తుల చేతుల్లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే బుధవారం వెల్లంపల్లి రోడ్డులోని బంధువుల శుభకార్యం వద్ద జరిగిన వివాదం చివరకు మాజీ కౌన్సిలర్ అల్లె దశరథంతోపాటు అతడి కుమారుడు దాడికి దారితీసినట్లు సమాచారం. తండ్రీకొడుకులిద్దరిని నలుగురు వ్యక్తులు నడిరోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దశరథం భార్య రజిత ఒకవైపు భర్తను.. మరోవైపు రోడ్డుపై పడిపోయిన కొడుకును కొట్టొదంటూ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనపై ఇరువర్గాలు స్థానిక పోలీసులను ఫిర్యాదు చేసుకోగా కేసు నమోదు చేశారు. ఓ ఫంక్షన్ వద్ద జరిగిన వివాదం దాడికి దారితీసినట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. ఆయుధాలతో దాడులు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.

మాజీ కౌన్సిలర్ సహా కుమారుడిపై దాడి